Plane Crash: 11A సీటు.. 27ఏళ్ల క్రితమే అద్భుతం.. విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన నటుడు ఇతడే..
అందులో 146 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 101 మంది చనిపోయారు. 45మంది మాత్రమే గాయాలతో బయటపడ్డారు.

Plane Crash: 11ఏ సీటు.. అహ్మదాబాద్ ఘోర విమానం ప్రమాదం తర్వాత ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిన పదం. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. దీనికి కారణం.. ఎయిరిండియా విమాన ప్రమాదంలో అందరూ చనిపోయినా.. ఒకే ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అతడే విశ్వాస్ కుమార్. దీనికి ఒకే ఒక్క కారణం విమానంలోని నెంబర్ 11ఏ సీటు. అవును, 11ఏ సీటులో కూర్చోవడం వల్లే అతడు సురక్షితంగా బయటపడ్డాడు.
బ్రిటన్ వాసి విశ్వాస్ కుమార్ కూర్చున్న 11ఏ సీటు అత్యవసర ద్వారాల్లో ఒకదానికి దగ్గరలో ఉండటం ప్రమాదం నుంచి బయటపడటానికి దోహదపడి ఉండొచ్చని విమానయాన నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ సీటులో కూర్చుంటే ప్రమాద సమయాల్లో క్షేమంగా బయటపడొచ్చని సూచిస్తున్న పలువురు నిపుణుల పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఎయిరిండియా విమాన ప్రమాదం పెను విషాదం నింపింది. అందులోని 242 మందిలో (ప్రయాణికులు, సిబ్బంది కలిపి) 241 మంది చనిపోయారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇంత ఘోర ప్రమాదం నుంచి గాయాలతో బయటపడిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్. ఈ ఘటన తర్వాత విమానంలోని 11ఏ సీటు గురించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. 11ఏ సీటు 27 కిందటే అద్భుతం చేసినట్లు తెలుస్తోంది. 27 క్రితం జరిగిన ఓ విమాన ప్రమాదంలోనూ.. 11ఏ సీటులో కూర్చున్న ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడట.
తాజాగా 11ఏ సీటు గురించి థాయ్ నటుడు, గాయకుడు రువాంగ్‌సక్ లాయ్‌చూజాక్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 11A సీటులో కూర్చున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు వచ్చిన వార్తలు చూసి తాను చాలా ఆశ్చర్యపోయానని ఆయన తెలిపారు. గతంలో తనకు ఎదురైన అనుభవాన్ని ఈ సందర్భంగా ఆయన పంచుకున్నారు. ఓ విమాన ప్రమాదంలో 11ఏ సీటు కారణంగా తాను ప్రాణాలతో బయటపడిన వైనాన్ని వెల్లడించారు.
Also Read: జపనీస్ వాకింగ్ ఇప్పుడు ట్రెండ్.. షుగర్, బీపీ మాయం.. మీరు కూడా ట్రై చేయండి
”దాదాపు 27 ఏళ్ల క్రితం అంటే.. డిసెంబర్ 11, 1998న థాయ్ ఎయిర్‌వేస్ విమానం (TG261) దక్షిణ థాయిలాండ్‌లో దిగడానికి ప్రయత్నిస్తుండగా కూలిపోయింది. అందులో 146 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 101 మంది చనిపోయారు. 45మంది మాత్రమే గాయాలతో బయటపడ్డారు. ఆ సమయంలో 11A సీటులో కూర్చున్న నేను మాత్రం ఎటువంటి గాయాలు లేకుండా సేఫ్ గా ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. మళ్లీ ఇప్పుడు సరిగ్గా అదే విధంగా జరిగేసరికి నేను షాక్ అయ్యాను” అని రువాంగ్ సక్ తన పోస్టులో తెలిపారు.
”ఆ విమాన ప్రమాదం నాకు పునర్జర్మ. కొన్ని రోజుల పాటు ఆ షాక్ నుంచి బయటకు రాలేకపోయాను. భయంతో పదేళ్లు విమాన ప్రయాణమే చేయలేదు” అని గతాన్ని గుర్తు చేసుకున్నారు రువాంగ్ సక్. 27 ఏళ్ల క్రితమే విమాన ప్రమాదం నుంచి 11ఏ సీటు వల్ల తాను ప్రాణాలతో బయటపడినట్లు థాయ్ నటుడు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విమానంలోని సీట్ నెంబర్ 11ఏ గురించి అంతా చర్చించుకుంటున్నారు.