Mahakumbh Stampede Incident : కుంభమేళా తొక్కిసలాట ఘటనకు సంబంధించిన రాజకీయ దుమారం ఆగడం లేదు. రెండు రోజుల క్రితం ఈ దుర్ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు కావడం, దాన్ని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించడం జరిగిపోగా.. తాజాగా లోక్ సభలో దుమారం రేగింది. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ తొక్కిసలాట ఘటనపై ఆరోపణలు గుప్పించారు. కుంభమేళా తొక్కిసలాట ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టిందని ఆరోపించారు.
కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై లోక్ సభలో పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. మహాకుంభ్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనలో చోటు చేసుకున్న మరణాల సంఖ్యను యూపీ ప్రభుత్వం దాచి పెడుతోందని ఆరోపించారు. అసలైన మృతుల సంఖ్య చెప్పాలని డిమాండ్ చేశారు.
కుంభమేళాకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పటికీ యోగి సర్కార్ అందుకు తగ్గ ఏర్పాట్లు చెయ్యకుండా కేవలం ప్రమోషన్లలో బిజీగా ఉందని విమర్శించారు. 100 కోట్ల మంది భక్తులకు సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం చెప్పిందన్నారు. అయినా కీలక ఘట్టమైన అమృత స్నానం నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, సరైన ఏర్పాట్లు చేయకపోవడమే వల్లే కుంభమేళాలో తొక్కిసలాట జరిగి భక్తులు మృతి చెందారని ఫైర్ అయ్యారు అఖిలేశ్.
మహాకుంభమేళాలో మౌని అమావాస్య రోజున తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ విషాద ఘటనలో 30 మంది భక్తులు చనిపోయినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ దుర్ఘటన తర్వాత ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉండగా రెండు రోజులుగా లోక్ సభలోనూ ప్రతిపక్ష నేతలు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైనా.. ప్రత్యేకంగా విచారణ చేపట్టేందుకు నిరాకరించింది కోర్టు. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలంటూ సుప్రీంకోర్టు సూచించింది.