Unburnt Ravan Heads: రావణుడి 10 తలలు కాలలేదని ఒక ఉద్యోగి సస్పెండ్.. నలుగురు అధికారులకు నోటీసులు

All 10 Ravan Heads Remained Unburnt, Chhattisgarh Clerk Punished
Unburnt Ravan Heads: దసరా వేడుకల్లో రావణాసుడి దిష్టి బొమ్మల్ని తగలబెట్టడం సర్వ సాధారణమే. కొన్ని అనుకున్న విధంగా జరుగుతుంటుంది. కొన్ని సార్లు దానికి భిన్నంగా జరుగుతుంది. రావణుడి ప్రతిమ తగలబెడుతుండగా కొందరికి జన సమూహాల వైపుకు మంటలు ఎగిసి పడడం, లేదా దిష్టిబొమ్మ సరిగా కాలకపోవడం లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి లైట్ తసుకుంటారు. ఎలా జరిగినా పండగైతే గడిచిందిలే అని అనుకుంటారు. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ధామ్తరి మున్సిపల్ కార్పొరేషన్ ఇలా అనుకోలేదు. రావణుడి దిష్టి బొమ్మలోని పది తలలు కాలలేదని ఒక ఉద్యోగిని సస్పెండ్ చేయడంతో పాటు మరో నలుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు పంపింది.
ఈ నెల 5న దేశ వ్యాప్తంగా దసరా ఉత్సవాలు జరిగాయి. ధామ్తరి పట్టణంలోని రామ్లీలా మైదానంలో ధామ్తరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూడా వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో అంతటా చేసినట్లే రావణ దహనం చేశారు. అయితే రావణుడి దిష్టిబొమ్మ మొత్తం కాలిపోయినప్పటికీ పది తలలు మాత్రం కాలలేదు. దీంతో తమ ప్రతిష్టను కించపరిచేలా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ధామ్తరి మున్సిపల్ కార్పొరేషన్ మండిపడింది. ఇంతటితో ఆగకుండా దిష్టిబొమ్మ రూపొందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ గుమస్తా రాజేంద్ర యాదవ్పై సస్పెన్షన్ వేటు వేసింది. నలుగురు అధికారులైన ఇంజనీర్ విజయ్ మెహ్రా, సబ్ ఇంజనీర్లు లోమస్ దేవాంగన్, కమలేష్ ఠాకూర్, కమతా నాగేంద్రలకు షోకాజ్ నోటీసులు పంపారు. ఇక వీరే కాకుండా దిష్టిబొమ్మను తయారు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ధామ్తరి మేయర్ విజయ దేవగన్ పేర్కొన్నారు.