Amit Shah Challenge to Mamata: చొరబాటుదారులకు ఓటర్ కార్డులు.. సీఏఏపై మమతా బెనర్జీకి ఛాలెంజ్ విసిరిన అమిత్ షా
ఒకప్పుడు సాహిత్యం, సైన్స్, కళ, పరిశ్రమ, ఆధ్యాత్మికత, స్వాతంత్య్ర ఉద్యమంలో దేశంలో బెంగాల్ ముందుండేదని, అయితే ఇప్పుడు మమతా బెనర్జీ కారణంగా దేశంలోనే వెనుకబడిన రాష్ట్రంగా మారిందని అమిత్ షా విమర్శలు గుప్పించారు.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అంశాన్ని లేవనెత్తుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోకి వస్తున్న చొరబాటుదారులకు మమతా ప్రభుత్వం ఓటరు గుర్తింపు కార్డులు ఇస్తోందని, అందుకే సీఏఏను వ్యతిరేకిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో బుధవారం (నవంబర్ 29) జరిగిన బహిరంగ ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ‘‘ఇన్ని చొరబాట్లు ఉన్న రాష్ట్రం బెంగాల్. అలాంటి రాష్ట్రం ఎప్పటికైనా అభివృద్ధి చెందగలదా? సీఏఏ అనేది జాతీయ చట్టం. దానిని ఎవరూ ఆపలేరు. దాన్ని అమలు చేస్తూనే ఉంటాం’’ అని అన్నారు.
బెంగాల్‌ను నాశనం చేసిన మమత
ఇంతకుముందు చొరబాటు కారణంగా పార్లమెంటును నడపనివ్వని మమతా బెనర్జీ ఇప్పుడు వారికి ఓటరు కార్డులు ఇస్తున్నారని అమిత్ షా అన్నారు. అందుకే సీఏఏను మమత వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. నేడు బెంగాల్‌లో అవినీతి తారాస్థాయికి చేరుకుందని, బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోందని, గతంలో ఎన్నడూ లేనివిధంగా రాజకీయ నాయకుల ఇళ్లలో నోట్ల కట్టలు గుట్టలుగా పెరిగిపోయాయని అమిత్ షా అన్నారు.
ఒకప్పుడు సాహిత్యం, సైన్స్, కళ, పరిశ్రమ, ఆధ్యాత్మికత, స్వాతంత్య్ర ఉద్యమంలో దేశంలో బెంగాల్ ముందుండేదని, అయితే ఇప్పుడు మమతా బెనర్జీ కారణంగా దేశంలోనే వెనుకబడిన రాష్ట్రంగా మారిందని అమిత్ షా విమర్శలు గుప్పించారు. బెంగాల్‌ను పూర్తిగా నాశనం చేశారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతల రాజకీయ హత్యలపై అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. టీఎంసీ ప్రభుత్వానివి బుజ్జగింపు, చొరబాటు, అవినీతి, హింసా రాజకీయాలని ఆయన విమర్శించారు.
బెంగాల్ లో కమల ప్రభుత్వంపై ఆశాభావం
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, 2026లో అధికారంలోకి వస్తుందని అమిత్ షా అన్నారు. అయితే 2026లో బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో పునాది వేయాలని, నరేంద్ర మోదీని మరోసారి దేశానికి ప్రధానిని చేయాలని చెప్పడానికే తాను అక్కడికి వచ్చినట్లు అమిత్ షా చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ప్రభుత్వాన్ని పడగొట్టి బిజెపిని ఎన్నుకోవాలని ఆయన ప్రజలను కోరారు.