బడ్జెట్ నిరాశ కలిగించింది : ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన

  • Published By: chvmurthy ,Published On : February 1, 2020 / 02:45 PM IST
బడ్జెట్ నిరాశ కలిగించింది : ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన

Updated On : February 1, 2020 / 2:45 PM IST

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ అంశంలో చాలా నిరాశ కల్గించిందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అన్నారు. ఆర్ధిక పరిస్ధితి క్రమంగా స్లో డౌన్‌ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2018-19లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన పన్నుల వాటా రూ.2500 కోట్లు తగ్గించారని, ఇది రాష్ట్రానికి పెద్ద దెబ్బని వాపోయారు. రెవెన్యూ లోటుపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. వెనకబడిన ఏడు జిల్లాలకు ప్యాకేజీ అన్నారు.. కానీ ఇవ్వలేదన్నారు.

రాష్ట్రంలో చాలా ఇబ్బందికర పరిస్ధితి ఉందని, ఐదేళ్లుగా ఎన్నోసార్లు కేంద్రానికి ఆర్ధిక పరిస్ధితి విన్నవిస్తూనే ఉన్నామని బుగ్గన చెప్పారు. జీఎస్‌టీ చట్టం ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వాలని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా రాలేదని బుగ్గన చెప్పారు. ఈ ఏడాది 7, 8 రాష్ట్రాలు మినహా… మిగిలిన అన్ని రాష్ట్రాలకు రీఇంబర్స్‌మెంట్‌ ఇవ్వాల్సి ఉందని తెలిపారు.

ప్రభుత్వ రంగ సంస్ధల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 2 లక్షల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేశారని… బడ్జెట్‌ పూర్తిగా ప్రశ్నార్ధకంగా తయారైందని బుగ్గన అన్నారు. ప్రజల ఇష్టాలకు వ్యతిరేకంగా  రాష్ట్ర విభజన జరిగిందని.. హైదరాబాద్‌ నుంచి ఎన్నో వదులుకున్నాం, కానీ మనకు అవన్నీ రాలేదని ఆయన వివరించారు. పోలవరం రీఇంబర్స్‌మెంట్‌ కూడా జాప్యం జరుగుతుంది..ఇండస్ట్రియల్‌ ఇన్సెంటివ్స్‌ రాలేదని మంత్రి తెలిపారు.

గ్రామీణ మహిళల కోసం ప్రవేశ పెట్టిన ధాన్యలక్ష్మి పథకం మంచిదని ఆయన కితాబిచ్చారు. కిసాన్‌ రైలు ఏర్పాటు చేయడం…కృషి ఉడాన్‌ ఏర్పాటు ఆహ్వానించ దగ్గ పరిణామని మంత్రి తెలిపారు. హార్టికల్చర్‌ విభాగంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. వెనుకబడిన జిల్లాల్లో ఆసుపత్రుల నిర్మాణానికి ఆయుష్మాన్‌ భారత్‌ నిర్ణయం మంచిదే.. కొత్త ఎయిర్‌ పోర్ట్‌ల నిర్మాణం మంచి పరిణామం, డేటా సెంటర్‌ పార్క్‌ల ఏర్పాటు మంచిదే.. చిన్న పరిశ్రమలకు రీస్ట్రక్చరింగ్‌ ఇవ్వడం మంచిదే.. బ్యాంకింగ్‌ సెక్టార్‌లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మంచి పరిణామమే అని బుగ్గన చెప్పారు.