ఉద్యోగంలో చేరినప్పటి నుంచి లంచాలకు మరిగాడు ఓ కానిస్టేబుల్. లంచాలు తీసుకుంటూ రూ.8 కోట్లు సంపాదించాక ఇక తనకు ఆ కానిస్టేబుల్ ఉద్యోగం వద్దని, ఆ డబ్బుతో జీవితాంతం కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చని భావించాడు. చివరకు అధికారులకు దొరికిపోయాడు.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ వద్ద రూ.2.87 కోట్ల నగదు, 234 కిలోల వెండి సహా మొత్తం కలిపి రూ.7.98 కోట్ల ఆస్తులు గుర్తించినట్లు లోకాయుక్త పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అతడి లావాదేవీలపై అనుమానం వచ్చి డిసెంబరు 18, 19 తేదీల్లో అతడి నివాసం, కార్యాలయంలో సోదాలు జరిపిన తర్వాత ఇంతటి భారీ మొత్తంలో ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఆ అధికారి తెలిపారు.
లోకాయుక్త పోలీస్ డైరెక్టర్ జనరల్ జైదీప్ ప్రసాద్ ఈ కేసు గురించి మాట్లాడుతూ.. సౌరభ్ శర్మ తండ్రి ఆర్కే శర్మ ప్రభుత్వ వైద్యుడని.. 2015లో అతడు మరణించాడని తెలిపారు. ఆ తర్వాత సౌరభ్ శర్మ 2015లో కారుణ్య ప్రాతిపదికన రాష్ట్ర రవాణా శాఖలో కానిస్టేబుల్‌గా నియమితుడై 2023లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నట్లు తెలిపారు.
లంచాలు తీసుకుని సంపాదించిన డబ్బుతో ఆ మాజీ కానిస్టేబుల్ తన తల్లి, భార్య, కోడలు, సన్నిహితుల పేరిట ఓ స్కూల్, హోటల్‌ను కూడా కట్టాడని చెప్పారు. అరేరా కాలనీలోని ఈ-7 సెక్టార్‌లోని అతని నివాసంలో సోదాలు నిర్వహించగా రూ.1.15 కోట్ల విలువ కలిగిన నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
అలాగే, రూ.50 లక్షల ఆభరణాలు, రూ.2.21 కోట్ల విలువైన వాహనాలతో సహా ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఆ తర్వాత అతడి కార్యాలయంలోనూ రూ.1.72 కోట్ల నగదు, రూ.2.10 కోట్ల విలువైన 234 కిలోల వెండి, రూ.3 కోట్ల విలువైన ఇతర ఆస్తులు కూడా దొరికాయని తెలిపారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సౌరభ్ శర్మ, అతని భార్య, తల్లి, సహచరులకు సమన్లు జారీ చేసినట్లు వివరించారు.
Chandrababu Naidu: నేడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు.. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ