Astra Missile: ‘అస్త్ర’ క్షిపణి పరీక్ష విజయవంతం.. శత్రుదేశాల ఆటలిక సాగవ్.. భవిష్యత్ వైమానిక యుద్ధాల్లో గేమ్ ఛేంజర్‌.. ప్రత్యేకతలు ఇవే..

గనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల ఈ అస్త్రాన్ని సుఖోయ్-ఎంకేఐ యుద్ధ విమానంతో ఒడిశా తీరంలో ప్రయోగించారు.

Astra Missile: ‘అస్త్ర’ క్షిపణి పరీక్ష విజయవంతం.. శత్రుదేశాల ఆటలిక సాగవ్.. భవిష్యత్ వైమానిక యుద్ధాల్లో గేమ్ ఛేంజర్‌.. ప్రత్యేకతలు ఇవే..

Astra Missile

Updated On : July 12, 2025 / 1:47 PM IST

Astra Missile: భారత వాయుసేన అమ్ములపొదిలో మరో అస్త్రం చేరబోతుంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్షిపణులు, ఆయుధాల సహాయంతో శత్రు దేశాలకు చెక్ పెట్టేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో స్వదేశీ పరిజ్ఞానంతో సరికొత్త క్షిపణులను తయారు చేస్తోంది. ఇందులో భాగంగా దృశ్య పరిధి అవతలున్న (బియాండ్ విజువల్ రేంజ్) లక్ష్యాలను ఛేధించే ‘అస్త్ర’ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది.

గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల ఈ అస్త్రాన్ని సుఖోయ్-ఎంకేఐ యుద్ధ విమానంతో ఒడిశా తీరంలో ప్రయోగించారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భారత వాయుసేనల ఆధ్వర్యంలో అస్త్ర క్షిపణిని పరీక్షించారు. ఇది 100 కిలోమీటర్లకు మించిన లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. ఇందులో అధునాతన గైడెన్స్, నేవిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి. పరీక్ష సమయంలో రెండు క్షిపణులను ప్రయోగించారు. అద్భుతంగా పనిచేసిన ఆ క్షిపణి రెండుసార్లు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ధ్వంసం చేసింది.

అస్త్ర క్షిపణిలో స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ఎఫ్) సీకర్‌ ఉన్నట్లు రక్షణ శాఖ తెలిపింది. మొత్తం రెండు పరీక్షలు నిర్వహించామని, అందులో భిన్న ఎత్తుల్లోని డ్రోన్లను లక్ష్యాలుగా చేసుకున్నట్లు వివరించింది. ఈ పరీక్షల్లో అన్ని వ్యవస్థలూ అంచనాలకు తగ్గట్టు పనిచేశాయని డీఆర్‌డీవో తెలిపింది. అస్త్ర పరీక్ష విజయవంతం కావడం పట్ల డీఆర్డీవో, ఐఏఎఫ్ ను రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ అభినందించారు.


అస్త్ర క్షిపణి 100 కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న టార్గెట్లను పేల్చగలదు. అత్యుత్తమమైన గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థలు దీంట్లో ఉన్నాయి. క్షిపణి పరీక్షలో.. స్వదేశీ ఆర్ఎఫ్ సీకర్‌తో సహా అన్ని ఉపవ్యవస్థలు అంచనా వేసిన విధంగా పనిచేశాయి. ‘అస్త్ర’ అధునాతన మార్గదర్శకత్వం, నావిగేషన్ వ్యవస్థతో అమర్చబడి ఉంది. ఈ క్షిపణి భవిష్యత్ వైమానిక యుద్ధాలలో గేమ్ ఛేంజర్‌గా కాబోతుంది. రాబోయే కాలంలో దీనిని వైమానిక దళంలో చేర్చనున్నారు.