కరోనా కొత్త రకం : బ్రిటన్ నుంచి వచ్చిన 24మందికి పాజిటివ్

24 passengers test Covid positive సెప్టెంబర్ లో బ్రిటన్ లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్ పై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ కొత్తరకం కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోందని…ఇప్పటి వైరస్ కన్నా 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రాధమిక నివేదకలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గడిచిన 2 రోజుల్లో బ్రిటన్ నుంచి భారత్ కు వచ్చిన దాదాపు 24మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.
బ్రిటన్ నుంచి అమృత్ సర్ లో ల్యాండ్ అయిన 8మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ రాగా, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో దిగిన 6గురికి,అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన 5గురికి పాజిటివ్ గా తేలింది. అదేవిధంగా కోల్ కతాలో ఇద్దరికి,బెంగళూరులో ఇద్దరికి,చెన్నైలో ఒక ప్రయాణికుడికి పాజిటివ్ గా తేలింది. అయితే, పాజిటివ్ వచ్చిన వారందరికీ సోకింది కరోనా కొత్త జాతేనా? కాదా అని తెలుసుకునేందుకు వారి శాంపిల్స్ ని పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వంటి స్పెషలైజ్డ్ ల్యాబ్ కు పంపినట్లు అధికారులు తెలిపారు.
బ్రిటన్ లో కొత్త కరోనా వైరస్ జోరు బాగా ఎక్కువగా ఉండటంతో భారత ప్రభుత్వం.. రెండు దేశాల మధ్యా విమాన సర్వీసులన్నింటినీ బుధవారం(డిసెంబర్-23,2020) నుంచి ఈ నెల 31 వరకు రద్దు చేసింది. విమానాలను బుధవారం నుంని బ్యాన్ చేస్తామని భారత్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత రెండు రోజుల్లో బ్రిటన్ నుంచి భారత్ కు చేరుకున్న వారందరూ తప్పనిసరిగా RT-PCR టెస్ట్ చేయించుకోవాలని కేంద్రం తెలిపింది.
టెస్ట్ ఫలితం వచ్చేవరకు ఎయిర్ పోర్ట్ లలో వేచి ఉండాలని ప్రయాణికులకు సూచించింది. ఒకవేళ పాజిటివ్ వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫెసిలిటీలో ఐసొలేట్ అవ్వాలని మంగళవారం(డిసెంబర్-22,2020) కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కొత్త గైడ్ లైన్స్ లో పేర్కొంది. నవంబర్-25 నుంచి డిసెంబర్-23 లోపల యూకే నుంచి భారత్ కు వచ్చినవారందరూ తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాలని తెలిపింది. టెస్ట్ లో పాజిటివ్ వచ్చినవారికి ప్రతేక ఐసొలేషన్, పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో కలిసి ప్రయాణించిన సహచర ప్యాసింజర్లకు ఇనిస్టిస్ట్యూషనల్ క్వారంటైన్ వంటివి కేంద్ర ఆరోగ్యశాఖ.. విడుదల చేసిన కొత్త గైడ్స్ లో తెలిపింది.
మరోవైపు, బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్..ఇప్పటివరకైతే భారత్ లోకి ప్రవేశించలేదని మంగళవారం(డిసెంబర్-22,2020)కేంద్రం సృష్టం చేసింది. కొత్త రకం వైరస్ గురించి ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, అయితే మనం అప్రమత్తంగా ఉండటం అవసరమని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు.