Ayodhya Ram Mandir: అయోధ్యలో కీలక పరిణామాలు.. ప్రధాన కార్యదర్శి డ్రైవర్ అరెస్ట్.. చంపత్ రాయ్ సంచలన రాజీనామా
అయోధ్య రామ మందిర(Ayodhya Ram Mandir) విరాళాల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Ayodhya ram mandir Janmabhoomi Teerth Kshetra Trust General Secretary Champat Rai has resigned.
- అయోధ్య నిధుల దుర్వినియోగం కేసు
- చంపత్ రాయ్ సంచలన రాజీనామా
- ఎనిమిది మంది నిందితుల అరెస్ట్
- సీఎం యోగి కఠిన హెచ్చరిక
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర విరాళాల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో తన డ్రైవర్ అరెస్ట్ కావడంతో, నైతిక బాధ్యత వహిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ట్రస్టుకు చెందిన మరో సభ్యుడు అనిల్ మిశ్రా కూడా తమ బాధ్యతల నుంచి వైదొలిగారు. రామాలయ విరాళాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, ట్రస్టు సభ్యుడి ఫిర్యాదు మేరకు గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు చంపత్ రాయ్ డ్రైవర్‌తో సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కుంభకోణంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రెండు రోజుల క్రితమే తమ ప్రాథమిక నివేదికను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే ఈ అరెస్టులు, రాజీనామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయోధ్య రామాలయం(Ayodhya Ram Mandir)లో కానుకలు, నిధుల దుర్వినియోగంపై సిట్ దర్యాప్తును ముమ్మరం చేసిందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. భక్తుల సొమ్మును పక్కదారి పట్టించిన ఈ ఉదంతంలో పాలుపంచుకున్న ఎవరినీ, ఎంతటివారైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
సనాతన ధర్మం మరియు ప్రజల అమూల్యమైన విశ్వాసాన్ని నిలబెట్టడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ భరోసా ఇచ్చారు. అయోధ్య మందిరంలో జరిగిన ఈ ఘటనపై భక్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన విషయమని ఆయన పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఇదే సమయంలో, గతంలో రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారే.. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఈ నిధుల దుర్వినియోగం అంశంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలపై ముఖ్యమంత్రి మండిపడ్డారు.
