దుర్గా పూజా పందిళ్లు…భక్తులకు నో ఎంట్రీ

Bengal Puja Pandals No-Entry Zones For Visitors దసరా ఉత్సవాలు చూడలంటే కోల్ కతా వెళ్లి తీరాల్సిందే. ఎందుకంటే ఏటా అక్కడా నవరాత్రి సంబరాలు అంబరాన్నంటుతాయి. అయితే ఈ ఏడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆంక్షల నడుమ దుర్గా ఉత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, బెంగాల్ లో అతిపెద్ద పండుగైన దసరా ఉత్సవాలు ప్రారంభమవడానికి మరో మూడు రోజులే మిగిలి ఉన్న సమయంలో ఇవాళ(అక్టోబర్-19,2020)కోల్ కతా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.



బెంగాల్‌లో దుర్గా పూజా పందిళ్ల సంద‌డి మొద‌లైన నేపథ్యంలో…. క‌రోనా వైర‌స్ దృష్ట్యా ఈ సారి దుర్గాదేవి పందిళ్ల‌కు విజిట‌ర్స్‌(భక్తులు)ను అనుమ‌తించ‌రాదు అని కోల్‌క‌తా హైకోర్టు ఇవాళ త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. కేవ‌లం నిర్వాహ‌కులు మాత్ర‌మే పందిళ్ల‌ల‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇస్తున్నట్లు తెలిపింది. క‌రోనా వైర‌స్ దృష్ట్యా పెద్ద‌పెద్ద పందిళ్ల‌లో 25 మంది, చిన్న‌వాటికి 15 మందికి మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పిస్తూ ఆదేశాలిచ్చారు.



అన్ని పందిళ్ల ప్రవేశం దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. చిన్న పందిళ్ల‌ల్లో అయిదు మీట‌ర్ల లోపు, పెద్ద పందిళ్ల‌ను ప‌ది మీట‌ర్ల లోపు నో ఎంట్రీ జోన్లుగా ప్ర‌క‌టించారు. కోల్‌క‌తా సిటీలోని సుమారు 3వేల పందిళ్ల‌ దగ్గర ఒక‌వేళ జ‌నం రోడ్ల‌మీద‌కు వ‌స్తే, అప్పుడు వారిని అడ్డుకునేందుకు కావాల్సినంత పోలీసులు లేర‌ని కోర్టు చెప్పింది. జ‌స్టిస్ సంజిబ్ బెన‌ర్జీ, ఆర్జిత్ బెన‌ర్జీ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ తీర్పునిచ్చింది. పూజా మండ‌పాన్ని కంటోన్మెంట్ జోన్‌గా భావించాల‌ని కోర్టు తెలిపింది.