ఓటు వేసేందుకు వచ్చిన మహిళ ప్రాణాలు కాపాడిన డాక్టర్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజనులు

ఓటు వేసేందుకు వచ్చి లైనులో నిలబడిన ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమె వెనకే ఉన్న డాక్టర్ వెంటనే స్పందించి సీపీఆర్ చేసి ప్రాణాపాయం తప్పించారు.

Bengaluru Doctor Saves Woman : ఓటు వేసేందుకు వచ్చి గుండెపోటు బారిన పడిన ఓ మహిళను డాక్టర్ కాపాడిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. సరైన సమయంలో స్పందించి మహిళను సేవ్ చేసిన వైద్యుడిపై సోషల్ మీడియాలో నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కర్ణాటకలో రెండో విడత లోక్‌స‌భ‌ ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరిగింది. బెంగళూరులోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు లైనులో నిలుచునివున్న మహిళ ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఆమె వెనుకే నిల్చునివున్న డాక్టర్ వెంటనే స్పందించి సీపీఆర్(cardiopulmonary resuscitation) చేయడంతో ప్రాణాపాయం తప్పింది.

ఈ ఘటన గురించి డాక్టర్ గణేశ్ శ్రీనివాస ప్రసాద్ తన ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశారు. ”నేను క్యూలో వేచి ఉండగా, నా ముందు నిలుచునివున్న మహిళ గుండెపోటుతో కుప్పకూలిపోయింది. ఆమె పల్స్ ఆగిపోయింది.. నేను వెంటనే CPR ప్రారంభించాను.. అదృష్టవశాత్తు నిమిషాల్లో ఆమెకు స్పృహ వచ్చింద”ని ఎక్స్‌లో పేర్కొన్నారు. తర్వాత సదరు మహిళను పోలీసుల సహాయంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన ఫొటో, వీడియోను డాక్టర్ గణేశ్ శ్రీనివాస ప్రసాద్ ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ పోస్టును 2,25,000 మంది వరకు చూశారు. సరైన సమయంలో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడిన ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

”సమయానికి అక్కడ ఉన్నారు కాబట్టి వెంటనే స్పందించి మహిళ ప్రాణాలు కాపాడగలిగారు. మీరు అక్కడ ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలు. దేవుడు ఆశీసులు మీకు ఉంటాయ”ని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ”మీకు హ్యాట్సాఫ్ డాక్టర్. ఇలాంటి సమయాల్లో నిపుణులందరికీ CPR శిక్షణ తప్పనిసరి. మీరు వెంటనే స్పందించడంతో ఒక జీవితాన్ని కాపాడగలిగారు. మీకు ధన్యవాదాల”ని మరొకరు అన్నారు. “మీరు మెచ్చుకోదగిన డాక్టర్! మీ సమయానుకూల సేవకు ఎన్ని మాటలైనా సరిపోవు!” ఇంకొరు ప్రశంసించారు.

 

CPR చేయడానికి ఏం చేయాలి?
అయితే ఇలాంటి సందర్భాల్లో డాక్టర్ అందుబాటులో లేకపోయినా CPR గురించి తెలిసినవారెవరైనా ఇది చేయొచ్చని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. CPR చేయడానికి ముందు ఏంచేయాలనే దాని గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. ఎవరైనా కార్డియక్ అరెస్ట్ కు గురయ్యారని అనుమానం కలిగితే వెంటనే CPR చేయాలని సలహాయిస్తున్నారు.

ఎవరైనా స్పృహ కోల్పోయినా/కుప్పకూలినా అనుసరించాల్సిన చర్యలు
1. మీరు వారిని పిలవండి (తెలిసి ఉంటే పేరు పెట్టి పిలవండి). బాగున్నారా అని అడగండి
2. వారి నుంచి ఎటువంటి స్పందన లేకుంటే.. పల్స్ కొట్టుకుంటుందో, లేదో చెక్ చేయండి
3. పల్స్ లేకపోతే ఏమాత్రం ఆలోచించకుండా CPR చేయాలి

Also Read: బైకుపై ‘స్పైడర్ మ్యాన్’ జంట షికార్లు.. షాకిచ్చిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు!

ట్రెండింగ్ వార్తలు