Video: ఉత్తర భారతీయుల వల్లే బెంగళూరు ఇంతగా అభివృద్ధి చెందిందంటూ ఈ అమ్మాయి చేసిన కామెంట్స్ వైరల్
"ఇక్కడి ప్రజలు ఉత్తర భారతీయులను ద్వేషిస్తారు. నేను గమినించిన విషయం ఇదే" అని చెప్పింది.

కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో “ఉత్తర భారత్ వర్సెస్ బెంగళూరు” అంశంపై చర్చ జరుగుతోంది. వలసల వల్లే బెంగళూరు అభివృద్ధి చెందిందని కొందరు అంటుండగా, దాని వల్ల సాంస్కృతికంగా విభేదాలు తలెత్తుతున్నాయని మరికొందరు వాదిస్తున్నారు.
ఇదే అంశంపై తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో ఓ అమ్మాయి మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఉత్తర భారతీయుల వల్లే ఇప్పుడు బెంగళూరు ఇంతగా అభివృద్ధి చెందిందని ఆమె అనడం గమనార్హం.
మొదట ఇంటర్వ్యూ తీసుకునే వ్యక్తి రోడ్డుపై ఓ అమ్మాయి వద్దకు వచ్చాడు. “ఢిల్లీ, చండీగఢ్ వంటి ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిగా మీరు బెంగళూరులో సంస్కృతి పరంగా ఎదుర్కొన్న అంశాలేమిటి?” అని అడిగాడు. దీనికి ఆ అమ్మాయి సమాధానం చెబుతూ… “ఈ సంస్కృతి మార్పుల గురించి నాకు తెలియదు కానీ, ఇక్కడి ప్రజలు ఉత్తర భారతీయులను ద్వేషిస్తారు. నేను గమినించిన విషయం ఇదే” అని చెప్పింది.
“మనం ఉత్తర భారత్ నుంచి వచ్చామని తెలిస్తే ఇక్కడి ప్రజలు మనతో భిన్నంగా ప్రవర్తిస్తారు. ఇక్కడి ఆటోవాలాలు మా నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఈ హిందీ వాళ్లు ఎక్కడి నుండి వచ్చారని ఆటోవాలాలు అంటుంటారు. మమ్మల్ని వారు చాలాసార్లు హిందీ జనాలు అని పిలిచారు” అని ఆ అమ్మాయి తెలిపింది. బెంగళూరు అంటే తనకు ఇష్టమేనని, అయితే ఇక్కడి ప్రజలు మాత్రం తమతో విభిన్నంగా వ్యవహరిస్తుంటారని చెప్పింది.
This girl thinks Banglore is Banglore because of North Indians 🤔 pic.twitter.com/aOEAN6hoXN
— Woke Eminent (@WokePandemic) December 21, 2024