బెంగళూరుకు తాగునీటి కష్టాలు.. మంచి నీటిని వృథా చేస్తే జరిమానా

కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరాన్ని నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. తాగు నీటి కోసం బెంగళూరు వాసులు చాలా కష్టాలు పడుతున్నారు.

Bengaluru water crisis: నీటి ఎద్దడితో కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరం అల్లాడుతోంది. వర్షాభావంతో తాగునీటి సమస్య తలెత్తడంతో బెంగళూరు వాసులు కష్టాలు పడుతున్నారు. నగరంలో తీవ్ర కొరత ఉన్నందున తాగునీటి వృథాను అరికట్టేందుకు బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు చర్యలు చేపట్టింది. మంచి నీటిని వృథా చేస్తే జరిమానా విధించాలని తాజాగా నిర్ణయించింది. తాగునీటి ఇతర అవసరాలకు వినియోగిస్తే జరిమానా తప్పదని హెచ్చరించింది.

నీళ్ల సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటిని వృథా చేయరాదని నగరవాసులను వాటర్ బోర్డు కోరింది. వాహనాలు కడగడం, నిర్మాణాలు, వినోదం కోసం తాగునీటిని ఉపయోగించకూడదని విజ్ఞప్తి చేసింది. తాగునీటి ఇతర అవసరాలకు వినియోగిస్తే 5వేల రూపాయల జరిమానా విధిస్తామని తెలిపింది. పునరావృతమైతే ప్రతిసారీ అదనంగా రూ. 500 జరిమానా విధించబడుతుందని ప్రకటించింది.

ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ
1.3 కోట్ల జనాభా ఉన్న బెంగళూరుకు రోజువారీ నీటి అవసరాల్లో 1,500 MLD (మిలియన్ లీటర్లు పర్ డే) కొరతను ఎదుర్కొంతోంది. నీటి కొరతను అధిగమించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. రీసైకిల్ చేసిన ట్రీటెట్ వాటర్ వాడుకునేందుకు నివాస కాలనీలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లను ప్రోత్సహిస్తోంది. అక్రమ నీటి ట్యాంకర్ కార్యకలాపాలను అరికట్టేందుకు హెల్ప్‌లైన్‌లు, కంట్రోల్ రూమ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రైవేటు వాటర్ ట్యాంకర్లు భారీగా రేట్లు పెంచేశారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: రాజ్యసభకు నామినేట్ అయిన ఇన్ఫోసిస్ సుధామూర్తి.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్

219 తాలూకాల్లో తీవ్ర కరువు పరిస్థితులు
బెంగళూరు మాత్రమే కాదు కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా కూడా తాగు నీటి సమస్య ఉంది. తుమకూరు, ఉత్తర కన్నడ జిల్లాలు అధికంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నట్టు రెవెన్యూ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 236 తాలూకాలు కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించబడ్డాయి. ఇందులో 219 తాలూకాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి.

ట్రెండింగ్ వార్తలు