జనవరి 8 భారత్ బంద్ ఎందుకు?: కార్మిక చట్టాలు ఏం చెబుతున్నాయి?

ప్రధాని నరేంద్రమోడీ పాలన వచ్చిననాటినుంచి కార్మిక వ్యతిరేక విధానాలను అమలుచేస్తోందనీ..కార్మికులపై అణచివేత చర్యలకు పాల్పడుతోందంటూ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా మోడీ విధానాలకు అవలంభిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్న విధానాలపై పోరాటమే ఈ జనవరి 8, 2020 భారత్ బంద్.
మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మారుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వర్గం శ్రామిక వర్గం. మోడీ విధానాలకు వ్యతిరేకంగా శ్రామిక వర్గం పోరాడకుండా దేశ వ్యాప్తంగా ఉండే కార్మికులకు ఉన్న హక్కులు పోవడం ఖాయం. అందుకే యావత్తు కార్మిక వర్గం మోడీ విధానాలపై పోరాటం చేపట్టింది. భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. జనవరి 8తోనే ఈ పోరాటం అంతం కాదిది ఆరంభం అన్నట్లుగా దేశవ్యాప్తంగా కార్మికు సంఘాలు నినదిస్తున్నాయి. మోడీ విధానాలు మారే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని నినదిస్తున్నారు. సమ్మెతో పాటు పలు ప్రాంతాల్లో బంద్‌గా కూడా పాటిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం, బడా పెట్టుబడిదారులు, బడా అధికారులు కలిసి కుమ్మక్కవుతున్నారని కార్మిక సంఘాలు విమర్శలు సంధిస్తున్నాయి. భూములు, గనులు, సముద్ర తీరాలను బడా బాబులకు ప్రభుత్వం కారుచౌకగా కట్టబెడుతోందని దీనిపై కార్మికు సంఘాలు పోరాటతాయని పోరాటంతో కార్మికులు తమ హక్కులను కాపాడకుని తీరుతాయని చాటి చెబుతున్నారు. స్వాతంత్య్ర సమరంతో సాధించుకున్నప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారు. 1991 నుంచి ప్రపంచీకరణ విధానాలు అమలు జరుగుతున్నాయి. కానీ బీజేపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో సామాన్యులకు నష్టంకలుగుతోంది. బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్నా విధానాలు వాటిని అమలు చేయడంతో వాటి ప్రభావం ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి.
తగ్గిన జీడీపీ..పెరిగిన ఆర్థిక మాంద్యం
జాతీయ జిడిపి తగ్గిపోవటం..ఆర్థిక మాంద్యం తీవ్రంగా పెరగడంతో ప్రస్తుతం దేశం యావత్తు గగ్గోలు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావం ఎంతగా ఉందీ అంటే దేశవ్యాప్తంగా 35 లక్షల మంది కార్మికులు కొన్ని సంవత్సరాలుగా ఉపాధి కోల్పోయారు. ఎన్నో వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. జిఎస్టీ, పెద్ద నోట్ల రద్దు ప్రభావం, బ్యాంకులు, ఆర్థిక వ్యవస్థపై పడింది. 2018-19 కాలంలో నిరర్ధక ఆస్తులు 126 శాతానికి పెరిగాయి.
సంఘటిత రంగంలో కూడా కుదించబడ్డ ఉద్యోగాలు
ఎన్నో సంస్థల్లో కాస్త ఎక్కువ జీతాలు ఉండే సంఘటిత రంగం కార్మికుల ఉద్యోగాలు భారీగా కుదించబడ్డాయి. రైల్వే, రక్షణ లాంటి రంగాలతో సహా రిక్రూట్‌మెంట్ అంతంతమాత్రంగానే ఉంది. ఈ ప్రభావం రిటైర్డ్ ఉద్యోగులకు వచ్చే పెన్షన్‌పై కూడా పడింది. న్యూ పెన్షన్ పేరుతో భావితరాలకు పెన్షన్ లేకుండా చేశారు. కోటి మంది అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులతో పూర్తి రోజు పని చేయించుకుంటున్నారు. గౌరవ వేతనం పేరుతో అతి తక్కువ జీతాలు ఇస్తున్నారు. శ్రమ దోపిడీ చేస్తున్నారు. 7.2 కోట్ల మంది ఉపాధి పథకంలో పని చేసే వ్యవసాయ కార్మికులకు రోజుకు రూ.200 చొప్పున చెల్లిస్తున్నారు. అతి తక్కువ జీతాలతో వీరు హీనమైన జీవితాలు గడుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ మధ్యస్థంగా ఉండే వ్యాపారులు..చిన్న వ్యాపారులపై భారాలు మోపుతోంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన గత ఆరు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం పన్నుల రాయితీల్లో రూ.2 లక్షల కోట్లు, బ్యాంకు రుణాల మాఫీతో పెట్టుబడిదారులకు అండగా నిలబడుతోంది.
కార్మికు జీతాల్లో కోత..బడాబాబులకు రాయితీలు : ప్రభుత్వం విధానం
అంతేకాదు కార్మికుల జీతాల్లో పలు విధాలుగా కోత పడుతోంది. కార్పొరేట్లు సంపదను సృష్టిస్తారని..దాని వల్ల పలువురికి ఉపాధి దొరుకుందని కాబట్టి కార్పొరేట్లకే రాయితీలు ఇవ్వాలనే సిద్ధాంతాన్ని చెప్పుకొస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరగటంతో ఉత్పత్తులు భారీగా పెరుగుతున్నాయి. దీనికి కారణం కార్మికుల శ్రమే అనే విషయాన్ని ప్రభుత్వం మరచింది. కార్పొరేట్లకే కొమ్ముకాస్తోంది. ఏ సంపద అయిన సృష్టించేది కార్మిక వర్గమే. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తోంది. వారికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఇటువంటి ఆర్థిక విధానాలతో ఆర్థిక మాంద్యం పెరిగింది. కష్టజీవులకు జీతాలు కోతలు పెట్టి కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టడం వల్లే ఆర్థిక వ్యవస్థ మందగించిందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
చైనా గ్రహించిన వాస్తవం : ఆర్థిక మాంద్యాన్ని గెలిచిన చైనా
శ్రీమంతుల కంటే సామాన్యులు కొనుగోలు చేస్తేనే ఏ వస్తువులైన అమ్ముడుపోతాయి. ఎందుకంటే దేశంలో శ్రీమంతులకంటే సామాన్యులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి. . ప్రజలందరికీ కొనుగోలు శక్తి వుండాలి. జీత భత్యాలు పెంచడం వల్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది. మరి అటువంటిది కార్మికుల జీతాలు కుదిస్తుంటే ప్రజలకు కొనుగోలు శక్తి ఎక్కడినుంచి వస్తుంది. ఈ విషయాన్ని చైనా బాగా అర్థం చేసుకుంది. అందుకే చైనా ఆర్థిక మాంద్యాన్ని సునాయాసంగా అధిగమించింది. అమెరికా దిగుమతులు ఆగిపోయినా చైనాపై ఎటువంటి ప్రభావం లేదు అనే విషయం గమనించాలి. అమెరికాతో ఎన్ని బెదిరింపులకు పాల్పడినా చైనా లెక్క చేయలేదు. నువ్వంటే నువ్వు అని ధీటుగా సమాధానం చెప్పగలుగుతున్నది.
ఇప్పటికైనా బీజేపీ ఆర్థిక విధానాలు మార్చుకోకపోతే యావత్తు దేశ ప్రజలు మరింత ఆర్థిక కష్టాల్లోకి నెట్టివేయబడతారు. స్వాతంత్య్రం ముందు నుంచి సాధించుకున్న కార్మిక హక్కులను మోడీ ప్రభుత్వం ఒక కలం పోటుతో కాలరాస్తోంది. కార్మిక హక్కులు పోరాడి సాధించుకున్నాయే తప్ప ఏ ప్రభుత్వం దయాదాక్షిణ్యాలతో ఇచ్చినవి కావనేది జగమెరిగిన సత్యం. పోరాడి సాధించుకున్న హక్కులు పోతుంటే కార్మిక వర్గం సహించి వూరుకోదు. ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమై పోరాడుతుంది. అందుకే పోరాడుతోంది. కార్మికు వర్గం పోరాడి పోరాడి సాధించుకుంటుంది. సాధించి తీరుతుంది. కార్మిక వర్గాల డిమాండ్స్ కు ఏ ప్రభుత్వం అయినా తల వంచాల్సిందే. లేకుండా నష్టపోక తప్పదు. ఇది చరిత్ర చాటిచెబుతోంది.
కార్మికులకు సంఘాలు ఎందుకు? కార్మిక చట్టంలో ఉన్నదేంటి?
సంఘం పెట్టుకునే హక్కుని సాధించుకున్న కార్మికులు 1926లో కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు సాధించుకున్నారు. సంఘాలు పెట్టకుండా చట్టాలను మార్చడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వ విధానాలున్నాయి. కొత్త కంపెనీల్లో గాని సంఘాలు పెట్టనివ్వడం లేదు. సంఘాలు పెడితే ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు. ప్రభుత్వ ఇచ్చే భరోసాతోనే ఆయా కంపెనీల యాజమాన్యాలు కార్మిక సంఘాలు ఉండకూడదంటున్నాయి. కార్మిక చట్టాల్లో ‘సంఘం పెట్టుకోవడం, యాజమాన్యాలతో సంప్రదింపులు..కార్మికులకు కష్టమొస్తే సంఘాలు యాజమాన్యాలకు డిమాండ్స్ (న్యాయపరమైనవి) పెట్టటం.. యాజమాన్యాలు ఒప్పుకోకుంటే సమ్మె పోరాటాలు చేయడం’ కార్మికులకు చట్టం ఇచ్చిన ప్రధాన హక్కులు.
కార్మిక చట్ట సవరణ పేరుతో భవిష్యత్ లో కార్మిక సంఘాలు ఉండకూదనేది బీజేపీ ప్రభుత్వం కుట్ర. సమ్మె చేస్తే జైలు శిక్షలు, నాయకులకు శిక్షలు, సమ్మె చేస్తే కార్మికుల జీతాల్లో కోతలు పెట్టటం వంటివన్నీ చట్టాల్లో రాబోతున్న మార్పులు. అంతేకాదు ఇష్టం వచ్చినట్లు కార్మికులను పనులనుంచి తీసివేయటం ప్రశ్నిస్తే కేసులు పెట్టటం..కార్మికుల సర్వీసు నిబంధనలు మార్చడం యాజమాన్యాల హక్కు’గా చేస్తున్నారు. ఈ దుర్మార్గ మైన దాడిపై కార్మికవర్గ తిరుగుబాటు తప్పనిసరి. కార్మిక పోరాటాలు ఆపడం ఏ ప్రభత్వ తరం కాదు. ఇది ప్రపంచ చరిత్ర చెప్పిన పాఠం. చరిత్రలోకి వెళ్లిచూస్తే ఇది తెలుస్తుంది. పారిశ్రామిక రంగం ప్రారంభ కాలం నుంచి నేటి వరకు కార్మిక వర్గం పోరాటాలు చేస్తునే ఉంది. హక్కులు సాధించుకుంటూనే ఉంది. ‘‘పోరాడితే పోయేదేముందు బానిస సంకెళ్లు తప్ప’’ అని మేధావులు చెప్పిన మాట అక్షర సత్యం. అందుకే కార్మికులు పోరాటాల బాట పట్టారు.