నవీన్ పట్నాయక్ స్టైలే వేరు.. తనను ఓడించిన బీజేపీ ఎమ్మెల్యేను అభినందించి..

ఎమ్మెల్యేగా ఒడిశా అసెంబ్లీలో నవీన్ పట్నాయక్ ప్రమాణం చేశారు. ఈ సందర్బంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

Naveen Patnaik greeted BJP MLA In Odisha Assembly

Naveen Patnaik greeted BJP MLA: బీజేడీ పార్టీ అధినేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. వర్తమాన రాజకీయాల్లో మంచి నాయకుడిగా పేరుగాంచారు. ఒడిశాకు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన నిరాడంబరంగా ఉండటానికే ఇష్టపడతారు. రాజకీయ ప్రత్య్థర్థులను కూడా సమభావంతో చూస్తారు. తాజాగా జరిగిన ఒడిశా అసెంబ్లీ రెండు స్థానాల నుంచి పోటీ చేసిన ఆయన.. ఒకచోట ఓడిపోయారు. బీజేపీ అధికారం దక్కించుకోవడంతో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ఎమ్మెల్యేగా మంగళవారం ఒడిశా అసెంబ్లీలో నవీన్ పట్నాయక్ ప్రమాణం చేశారు. ఈ సందర్బంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కాంతాబంజీ స్థానం నుంచి తనపై గెలిచి తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ బాగ్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నవీన్ పట్నాయక్‌ అసెంబ్లీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి వెళుతుండగా.. లక్ష్మణ్ బాగ్‌ తన సీటులోంచి లేచి నిలబడి ఆయనకు నమస్కారం చేసి, తనను పరిచయం చేసుకున్నారు. నవీన్ పట్నాయక్‌ ప్రతినమస్కారం చేసి.. ”మీరే కదా నన్ను ఓడించారు” అని సరదాగా అన్నారు. తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలకు నమస్కారం చేస్తూ ముందుకు సాగారు. కొంత మంది బీజేపీ ఎమ్మెల్యేలతోనూ అప్యాయంగా ఆయన ముచ్చటించారు.

తనపై గెలిచిన ఎమ్మెల్యేకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపిన నవీన్ పట్నాయక్‌పై సోషల్ మీడియాలో నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజకీయాల్లో పాజిటివ్ వాతావరణం కల్పించడానికి ఆయన ప్రయత్నిస్తున్న తీరును మెచ్చుకుంటున్నారు. కాగా ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణస్వీకారానికి హాజరైనప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ఆ పార్టీ సీనియర్ నాయకులను నవీన్ పట్నాయక్ అప్యాయంగా పలకరించి అందరి మన్ననలు పొందారు.

Also Read: పెళ్లి చేసుకోబోతున్న విజయ్ మాల్యా కుమారుడు.. వధువు ఎవరో తెలుసా.. ఫొటోలు వైరల్

కాగా, అసెంబ్లీలో ఎమ్మెల్యేగా నవీన్ పట్నాయక్ ప్రమాణం చేసిన సమయంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, మంత్రులతో పాటు సభలో ఉన్న ఎమ్మెల్యేలంతా లేచి నిలబడి ఆయనకు అభినందనలు తెలియజేయడం విశేషం. దటీజ్ నవీన్ పట్నాయక్!

 

ట్రెండింగ్ వార్తలు