నేను ఎంపీగా ఓడినా.. గెలిచినట్టే లెక్క: నవనీత్‌ రవి రాణా కీలక వ్యాఖ్యలు

గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించిన అమరావతి ప్రజలు.. ఈసారి బీజేపీ తరపున పోటీ చేస్తే ఎందుకు ఓడించారో అర్థం కావడం లేదని మాజీ ఎంపీ నవనీత్‌ రవి రాణా వాపోయారు.

Navneet Ravi Rana: ఎన్నికల్లో ఓడిపోయినా తాను గెలిచానని ఒకప్పటి నటి, మాజీ ఎంపీ నవనీత్‌ రవి రాణా వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన లోక్‌స‌భ‌ ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆమె పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్వంత్ బస్వంత్ వాంఖాడే చేతిలో 19,731 ఓట్ల తేడాతో ఓడిపోయారు. లోక్‌స‌భ‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో రంగారెడ్డి జిల్లా షాదన్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదయింది. ఎంపీగా ఓడిపోవడంపై తాజాగా స్పందించారు. శుక్రవారం నాగపూర్‌లో మీడియాతో మాట్టాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించిన అమరావతి ప్రజలు.. ఈసారి బీజేపీ తరపున పోటీ చేస్తే ఎందుకు ఓడించారో అర్థం కావడం లేదని నవనీత్‌ రవి రాణా వాపోయారు. తాను ఓడిపోయినా కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో మళ్లీ ప్రభుత్వం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ”లోక్‌స‌భ‌ ఎన్నికల్లో నేను ఓడిపోయివుండొచ్చు. కానీ నరేంద్ర మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు గెలిచానని భావిస్తున్నా. 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా అమరావతి ప్రజలు నన్ను గెలిపించారు. నేనేం తప్పుచేశానని 2024లో నా అమరావతి ప్రజలు నన్ను ఇక్కడ ఓడించార”ని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: అమిత్ షా సీరియస్ వార్నింగ్‌.. అసలేం జరిగిందో క్లారిటీ ఇచ్చిన తమిళిసై సౌందరరాజన్

హీరోయిన్ నుంచి ఎంపీ వరకు..
నవనీత్‌ కౌర్ పెళ్లికి ముందు సినిమాల్లో నటించారు. శీను వాసంతి లక్ష్మి సినిమాతో 2004లో తెలుగుతెరకు పరిచయమయ్యారు. జగపతి, గుడ్ బోయ్, రూమ్‌మేట్స్‌, స్టైల్, బంగారు కొండ, యమదొంగ, మహారథి, జాబిలమ్మ, ఫ్లాష్ న్యూస్ సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ, మలయాళం, పంజాబీ సినిమాల్లోనూ యాక్ట్ చేశారు. అమరావతి నగరంలోని బద్నేరా నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాను 2011, ఫిబ్రవరి 3న ఆమె పెళ్లి చేసుకున్నారు. సామూహిక వివాహ వేడుకతో పాటు వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. పెళ్లి తర్వాత ఆమె పేరు నవనీత్‌ రవి రాణాగా మారింది. 2019లో కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో అమరావతి ఎంపీగా గెలిచారు. ఈ ఏడాది మార్చి 24న తన భర్తతో కలిసి బీజేపీలో చేరారు.

Also Read: ప్రధాని నరేంద్ర మోదీ ‘తాడాసనం’ వీడియో చూశారా.. దీని వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు