రాజీవ్ పై మోడీ వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ నాయకుడు

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను మాజీ కేంద్రమంత్రి, కర్ణాటక బీజేపీ సీనియర్ లీడర్ వి.శ్రీనివాసప్రసాద్ తప్పబట్టారు. ప్రధాని మోడీ అంటే తనకు  చాలా గౌరవం ఉందని కానీ రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా మోడీ అలాంటి మాటలు మాట్లాడాల్సింది కాదని ఆయన అన్నారు.భోఫోర్స్ స్కాంలో రాజీవ్ పై ఆరోపణలు ఆమోదయోగ్యమైనవి కావన్నారు. రాజీవ్‌ గాంధీని ఎల్‌టీటీఈ ఉగ్రవాదులు కుట్ర పన్ని హత్య చేశారని, అవినీతి ఆరోపణలతో ఆయన చనిపోలేదని, అలా చనిపోయారంటే తానే కాదు ఎవరూ నమ్మరని శ్రీనివాసప్రసాద్ అన్నారు. రాజీవ్‌గాంధీకి వ్యతిరేకంగా అలాంటి వ్యాఖ్యలు చేయడం అనవసరమన్నారు. రాజీవ్‌గాంధీ చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు చేపట్టారని, అటల్‌ బిహారీ వాజ్‌పేయి లాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ఆయన గురించి గొప్పగా మాట్లాడారని శ్రీనివాస ప్రసాద్‌ అన్నారు.

మే-4,2019న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ….రాజీవ్‌గాంధీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ‘మీ నాన్న(రాజీవ్‌గాంధీ) మిస్టర్‌ క్లీన్‌ అని ఆయన సన్నిహితులే పొగిడారు. కానీ ఆయన జీవితం భ్రష్టాచారి(అవినీతిపరుడు) నంబర్‌ వన్‌ గా ముగిసింది’ అని మోడీ విమర్శించిన విషయం తెలిసిందే.బుధవారం(మే-8,2019) ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ మోడీ రాజీవ్‌ గాంధీపై విమర్శలు చేశారు. రాజీవ్‌ కుటుంబం యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను సొంత ట్యాక్సీలా వాడుకున్నారని ఆరోపించారు.మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు.మోడీజీ మా కర్మ ఫలం మీకోసం ఎదురుచూస్తోందంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు.కాంగ్రెస్ నేతలు మోడీ వ్యాఖ్యలను తప్పుబడుతున్న సమయంలో బీజేపీ నాయకుడు మోడీ వ్యాఖ్యలను ఖండించడం ఆశక్తికర పరిణామంగా మారింది.