సార్వత్రిక ఎన్నికలలో అఖండ మెజార్టీ సాధించి కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతాపార్టీ దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడాది కాలంలో తన అధికారాన్ని కోల్పోతూ వస్తోంది. ఏడాది కాలంలో 5 రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవటంతో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.
గత ఏడాది 2018, డిసెంబర్ లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ లలో బీజేపీ అధికారం కోల్పోయి ఆ రాష్ట్రాలను కాంగ్రెస్ కు అప్పగించింది. అనంతర పరిణామాల్లో మహారాష్ట్రల్లో కూడా అధికారం కోల్పోయిన భారతీయజనతా పార్టీ తాజాగా జార్ఖండ్‌లోనూ అధికారానికి దూరమైంది. దీంతో పార్టీ వర్గాల్లో కలవరం మొదలైంది. కేంద్రంలో అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చినా రాష్ట్రాలను కొల్పోవటం పార్టీకి మింగుడు పడటంలేదు.
ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లోనూ బీజేపీకి చేదు అనుభవం ఎదురైంది. మహారాష్ట్ర ఎన్నికల్లో మిత్రపక్షంగా పోటీ చేసినా సీఎం సీటు పంచుకునే విషయంలో శివసేనతో వచ్చిన విబేధాలతో..కాంగ్రెస్, ఎన్సీపీతో, కలిసిన శివసేన బీజేపీని ప్రతి పక్షంలో కూర్చోబెట్టింది. మహారాష్ట్రలో అధికారాన్ని అందుకోటానికీ బీజేపీ ఆడిన హై డ్రామాను ఇప్పట్లో ఎవ్వరూ మర్చిపోరు.
ఇక చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా హంగ్ వచ్చిన హర్యానాలో కింగ్ మేకర్ దుష్యంత్ చౌతాలా ఆదుకోవటంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బతుకు జీవుడా అంటూ బయట పడింది. చివరి నిమిషంలో దుష్యంత్ చౌతాలా ఆదుకోకపోయి ఉంటే హర్యానాను కూడా బీజేపీ కాంగ్రెస్ కు అప్పగించి ఉండేది.
2014 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలిచి నరేంద్ర మోడీ మొదటి సారి ప్రధానిగా అధికార పీఠం ఎక్కనాటికి దేశంలోని 7 రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉంది. 2018 మార్చి నాటికి బీజేపీ తన అధికారాన్ని 21 రాష్ట్రాలకు విస్తరించింది. అంతకు ముందు ఉన్న సంఖ్యతో పోలిస్తే ఇది 3 రెట్లు ఎక్కువ. కానీ ఆ తర్వాత 2018 డిసెంబరు నుంచి జరుగుతున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా5 రాష్ట్రాలను కోల్పోయింది.
ఈరోజు 2019,డిసెంబర్ 23న వెలువడిన జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి బీజేపీకి మరో రాష్ట్రాన్ని దూరం చేసింది. వరుసగా రెండోసారి గెలస్తామని కలలుగన్న బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు.
కర్ణాటక లో మాత్రం బీజేపీ కాస్త అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. అక్కడ కాంగ్రెస్-జేడీఎస్ సర్కారును కూల్చి అనైతికంగా అధికారాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీని ఉప ఎన్నికల్లో ఓటర్లు గెలిపించడంతో తిరిగి ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోగలిగింది.
మొత్తంగా సంవత్సర కాలంలో చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, మహారాష్ట్ర, జార్ఖండ్ లలో అధికారాన్ని కోల్పోయిన బీజేపీ కర్ణాటకలో మాత్రం సొంతంగా అధికారాన్ని చేపట్టింది. హర్యానాలో పొత్తు పెట్టుకుని అధికారంలో ఉంది. మోడీ షా ద్వయం వ్యూహరచనతో అఖండ భారతాన్ని ఏలేందుకు అఖండ మెజార్టీ పొందిన కమలనాధులకు ఇలా రాష్ట్రాలు చేజారుతుంటే ఏంచేయాలా అని దిక్కుతోచని పరిస్ధితిలో ఉన్నారు.