పీవీ హయాంలోనే తెచ్చారు : ఈబీసీ బిల్లుపై బీజేపీ

  • Published By: veegamteam ,Published On : January 9, 2019 / 10:06 AM IST
పీవీ హయాంలోనే తెచ్చారు : ఈబీసీ బిల్లుపై బీజేపీ

ఈబీసీ బిల్లు బీజేపీ కొత్తగా తీసుకొచ్చింది కాదని, పీవీ నరసింహారావు హయాంలోనే ఈబీసీ రిజర్వేషన్లపై నోటిఫికేషన్ ఇచ్చారని బీజేపీ ఎంపీ ప్రభాత్ ఝా గుర్తు చేశారు. రాజ్యాంగ సవరణ చేయకపోవడంతో ఆ బిల్లు కోర్టులో నిలవలేదన్నారు. రాజ్యసభలో ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న బీజేపీ ఎంపీ ప్రభాత్ ఝా.. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకొచ్చిన బిల్లుని పెద్ద మనసుతో అందరూ ఆమోదించాలని రిక్వెస్ట్ చేశారు. ప్రజలందరికి సమాన హక్కులు అందాలనే ఉద్దేశ్యంతో ఈబీసీ బిల్లు తీసుకొచ్చామని చెప్పారు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి రాష్ట్రాల అనుమతి అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్ బిల్లు భారత యువత గొంతుక అని చెప్పారు.

అగ్రకులాల పేదలకు రిజర్వేషన్ల వాగ్దానం పూర్తి చేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని ఎంపీ ప్రభాత్ అన్నారు. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 124వ రాజ్యాంగ సవరణ బిల్లుని తీసుకొచ్చింది. ఇప్పటికే లోక్‌సభలో ఈబీసీ బిల్లు పాస్ అయ్యింది. రాజ్యసభలోనూ పాస్ అయితే బిల్లు చట్టంగా మారనుంది. తొలిసారిగా అగ్రకులాల్లో ఆర్థికంగా వెనకబడినవారు రిజర్వేషన్లు పొందుతారు.