బీజేపీ అనుకున్న స్ట్రాటజీ ఫలిస్తే.. ఇలా ఉంటుంది.. లేదంటే..

Lok Sabha Elections 2024: ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా అయినా.. పొత్తుల మార్గం కాషాయం పార్టీకి కలిసివచ్చే అంశమనే చెప్పొచ్చు.

MODI

లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఈ సారి ఒంటరిగా 370 సీట్లను సాధించాలని, మిత్రపక్షాలతో కలిసి 400కు పైగా లోక్‌సభ స్థానాలు దక్కించుకోవాలని ప్రణాళిక వేసుకుంది బీజేపీ. దక్షిణ భారత్‌లో బీజేపీకి అంతగా బలం లేకపోయినా ఉత్తరాదిలో ఆ పార్టీకి ఎదురేలేకుండాపోతోంది.

ఉత్తర భారతంలో బీజేపీకి ఎంత బలం ఉన్నా.. దక్షిణ భారతంలో మాత్రం ఆశించినంత పట్టు లేదు. ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా అయినా.. పొత్తుల మార్గం కాషాయం పార్టీకి కలిసివచ్చే అంశమనే చెప్పొచ్చు. బీజేపీ అనుకున్న స్ట్రాటజీ ఫలించి.. దక్షిణాది నుంచి కూడా మరికొన్ని పార్టీలు ఎన్డీయేలో చేరితే ఆ పార్టీకి తిరుగుండదనే చెప్పొచ్చు. అంతేకాదు.. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అనుకున్న సీట్ల కంటే ఎక్కువే గెలుపొంది.. విజయఢంకా మోగించడం ఖాయం.

కూటములకు అత్యంత ప్రాధాన్యం
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో ఇప్పటి వరకు 38 పార్టీలుండగా.. జేడీయూ, ఆర్‌ఎల్డీ చేరికతో దాని బలం 40కి చేరింది. అయితే ఇందులో లోక్‌సభలో ప్రాతినిధ్యం లేని పార్టీలే ఎక్కువగా ఉన్నాయి. అయితే.. కాంగ్రెస్‌కు ప్రాంతీయ పార్టీలను దూరం చేసే క్రమంలో.. ఎన్డీయేకు ఇవన్నీ ముఖ్యంగా మారాయి. మరోవైపు.. ఇండియా కూటమిలోని పార్టీల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కుల సమీకరణాలు, ఓట్ల చీలిక, ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా సాగుతున్న ప్రస్తుత రాజకీయాల్లో… కూటములకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.

ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్రాల వారీగా తమతో కలిసి వచ్చే పార్టీలను ఎన్డీయేలో చేర్చుకుంటూ బలం పెంచుకుటోంది. తద్వారా వచ్చే ఎన్నికల్లో తాము అనుకున్న 400కు పైగా లోక్‌సభ స్థానాలు దక్కించుకునే వ్యూహాలు రచిస్తోంది. జమ్మూకశ్మీర్‌లో ఫరూక్‌ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసి… ఎన్డీయేలో చేరేందుకు సిద్ధమైంది. ఇది జమ్మూకశ్మీర్‌లో బీజేపీకి కలిసి వచ్చే అంశమనే చెప్పొచ్చు.

కేరళలో..
ఇక కేరళ రాష్ట్రంలో కేరళ జనపక్షం సెక్యులర్‌ పార్టీని బీజేపీలో విలీనం చేసింది. ఆ పార్టీ చీఫ్‌ పీసీ జార్జ్‌… కేరళ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జవడేకర్‌ సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన జార్జ్‌ చేరికతో… కేరళలో బీజేపీకి కాస్త బలం పెరిగిందని చెప్పొచ్చు. ఇక తమిళనాడులో ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన అన్నాడీఎంకేను మరోసారి కూటమిలో చేర్చుకునే ప్రయత్నాలు కూడా ప్రారంభించింది బీజేపీ.

ఏపీలో..
ఇక బీహార్‌లో నితీశ్‌కుమార్‌, మహారాష్ట్రలో అజిత్‌ పవార్‌ పార్టీలు ఎన్డీయేలో చేరడం బీజేపీకి చాలా కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. మరోవైపు.. ఏపీలో తెలుగుదేశం, జనసేనతో పొత్తు.. తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పెరిగిన ఓటు బ్యాంకుతో ఇక్కడ గతం కంటే ఎక్కువ సీట్లు గెలిచే అవకాశముందని కాషాయం పార్టీ భావిస్తోంది. అయితే.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, ఏపీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు అవసరమైన సందర్భాల్లో బీజేపీకి పరోక్షంగా మద్దతిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ పార్టీల్లో ఏవైనా ఎన్డీయేలో చేరినా బీజేపీ బలం దక్షిణ భారతంలో మరింతగా పెరిగే అవకాశముంది.

మొత్తంగా ఎన్డీయే కూటమిని బలోపేతం చేసుకోవడం ద్వారా అటు ఉత్తరాదితో పాటు, దక్షిణాదిలోనూ సీట్లు పెంచుకోవాలని చూస్తోంది బీజేపీ. ఇదే సమయంలో కాంగ్రెస్‌కు ప్రాంతీయ పార్టీలను దూరం చేయడం ద్వారా ఇండియా కూటమికి సీట్ల సంఖ్య తగ్గేలా వ్యూహం రచించింది. తద్వారా కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ నినాదంతో మరోసారి విజయం సాధించేలా ముందుకు సాగుతోంది భారతీయ జనతా పార్టీ.

BJP First List : బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల.. ఆ 8 సీట్లు పెండింగ్‌లో పెట్టడానికి కారణం ఏంటి?

ట్రెండింగ్ వార్తలు