పౌరసత్వ చట్టానికి మద్దతుగా…కోల్ కతాలో మెగా ర్యాలీ

పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలకు బీజేపీ కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఆదివారం సీఏఏకి మద్దతుగా నాగ్ పూర్,ముంబైలో లో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే సోమవారం(డిసెంబర్-23,2019)తమ టార్గెట్ ను వెస్ట్ బెంగాల్ గా ఎంచుకుంది బీజేపీ.

మమత సర్కార్ కు కౌంటర్ ఇస్తూ ఇవాళ కోల్ కతాలో బీజేపీ మెగా ర్యాలీ నిర్వహించింది. ధర్మతల రాణి రషోమ్మి రోడ్ నుంచి స్వామి వివేకానంద నివాసం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. సీఏఏకు మద్దతుగా నిర్వహించిన ఈర్యాలీలో వెస్ట్ బెంగాల్ బీజేపీ ఇన్ చార్జ్ కైలాష్ వార్గియతో పాటుగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్నవారు జాతీయ జెండాలు,బీజేపీ జెండాలు పట్టుకుని సీఏఏకు మద్దతుగా నినాదాలు చేశారు.

కోల్ కతాలో సీఎం మమతా బెనర్జీ సీఏఏ,ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా  నిరసన ప్రదర్శనలు చేపడుతున్న సమయంలో బీజేపీ కౌంటర్ ర్యాలీ నిర్వహించింది. అవసరమైతే తృణముల్ సర్కార్ ను డిస్మిస్ చేసుకోండి..తాము మాత్రం సీఏఏ,ఎన్ఆర్సీని బెంగాల్ లో అమలుచేసే ప్రశక్తే లేదని తేల్చి చెప్పింది. మరోవైపు మోడీ కూడా ఆదివారం మమత సర్కార్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మమత అసత్యపు ప్రచారాలు చేసి విద్యార్ధులను,యువతను రెచ్చగొడుతున్నట్లు మోడీ ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే మమత ఇదంతా చేస్తుందని మోడీ అన్న విషయం తెలిసిందే.