Neha Sharma : రాజకీయాల్లోకి ‘చిరుత’ హీరోయిన్.. భాగల్‌పూర్ బరిలో నేహా శర్మ..? బిగ్ హింట్ ఇచ్చిన కాంగ్రెస్ నేత!

Neha Sharma : భాగల్‌పూర్‌లో కాంగ్రెస్‌కు సీటు దక్కితే.. తన కుమార్తె నేహా శర్మ బరిలో దిగుతుందని ఆ పార్టీ నేత అజయ్ శర్మ అన్నారు. బీహార్ నుంచి ఎన్డీయేను తుడిచిపెట్టేస్తామని చెప్పారు.

Bollywood Actress To Contest From Bhagalpur

Neha Sharma : బాలీవుడ్ నటి, చిరుత హీరోయిన్ నేహా శర్మ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆమె తండ్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్ శర్మ బిగ్ హింట్ ఇచ్చారు. బీహార్‌లోని భాగల్‌పూర్ ఎమ్మెల్యే అజయ్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ.. మిత్రపక్షాలతో పార్టీ సీట్ల షేరింగ్ ఏర్పాట్లలో కాంగ్రెస్‌కు భాగల్‌పూర్ సీటు దక్కితే మాత్రం తన కుమార్తె నేహా శర్మను అభ్యర్థిగా ప్రతిపాదిస్తానని ఆయన చెప్పారు.

Read Also : Suspense On Narsapuram MP Candidate : నరసాపురం ఎంపీ టికెట్‌పై బీజేపీలో తీవ్ర ఉత్కంఠ

ఒకవేళ తన కూతురు కాకుండా అదే స్థానంలో తనను పోటీ చేయమన్నా బరిలోకి దిగేందుకు సిద్ధమని అజయ్ శర్మ వెల్లడించారు. ‘కాంగ్రెస్‌కి భాగల్‌పూర్ రావాలి. మేము పోరాడి గెలుస్తాం. భాగల్‌పూర్‌ సీటు కాంగ్రెస్‌కు వస్తే.. నా కుమార్తె నేహా శర్మ పోటీ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నాను. కానీ, పార్టీ నేను బరిలోకి దిగాలని కోరుకుంటే.. నేనే పోటీ చేస్తాను’ అని అజయ్ శర్మ అన్నారు.

చిరుత మూవీతో నేహా టాలీవుడ్‌లో ఎంట్రీ :
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన తొలిచిత్రం చిరుతలో నేహా శర్మ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్‌గా నేహా శర్మ ఇమ్రాన్ హష్మీ సరసన ‘క్రూక్’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత ‘తన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్’, ‘యమ్లా పగ్లా దీవానా 2’, ‘తుమ్ బిన్ 2’, ‘ముబారకన్’ వంటి సినిమాల్లోనూ నేహా నటించింది. అంతేకాదు.. ట్రావెల్ కంటెంట్‌తో సోషల్ మీడియాలో కూడా నేహా శర్మ బాగా పాపులర్ అయ్యింది. నేహాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

బీహార్ నుంచి ఎన్డీయేను తుడిచిపెట్టేస్తాం : అజయ్ శర్మ
ఇదిలా ఉండగా, ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి బీహార్‌లో బీజేపీని తుడిచిపెట్టేస్తుందని అజయ్ శర్మ పేర్కొన్నారు. బీహార్ నుంచి ఎన్డీయేను తుడిచిపెట్టేస్తామన్నారు. ఈసారి నరేంద్ర మోదీని అధికారం నుంచి దించే బాధ్యతను బీహార్ తీసుకుంటుందన్నారు. సీఎం నితీష్ కుమార్ జనవరిలో కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకుని బీజేపీతో చేతులు కలపడంతో బీహార్‌లో ఇండియా కూటమి సీట్ల పంపకం వ్యవహారం బెడిసికొట్టింది.

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ కూడా సీట్ల పంపకం చర్చలు దాదాపు ముగిశాయని, వచ్చేవారం అధికారిక ప్రకటన వెలువడవచ్చునని వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో అన్నీ నిర్ణయిస్తామని, సీట్ల చర్చ చివరి దశలో ఉందని, ఒకట్రెండు సీట్ల విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, అయితే అన్నీ సర్దుకుపోతాయని చెప్పారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా.. నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Read Also : Powers Of Enforcement Directorate : ఈడీ ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చా? అధికారాలు ఏంటి?