Bone Death : బాబోయ్.. ఎముకలు కుళ్లిపోయి, నిర్జీవంగా మారుతాయ్.. కరోనాతో కొత్త ముప్పు
కరోనావైరస్ మహమ్మారి ఏ ముహుర్తాన వచ్చిందో కానీ.. ఇంకా వెంటాడుతూనే ఉంది. జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొత్త కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. కరోనా నుంచి కోలుకున్నాం, హమ్మయ్య గండం గడిచింది, ప్రాణాలతో బయటపడ్డాం అని ఊపిరిపీల్చుకునే లోపే మరో కొత్త సమస్య వచ్చి పడుతోంది.

Bone Death
Bone Death : కరోనావైరస్ మహమ్మారి ఏ ముహుర్తాన వచ్చిందో కానీ.. ఇంకా వెంటాడుతూనే ఉంది. జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొత్త కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. కరోనా నుంచి కోలుకున్నాం, హమ్మయ్య గండం గడిచింది, ప్రాణాలతో బయటపడ్డాం అని ఊపిరిపీల్చుకునే లోపే మరో కొత్త సమస్య వచ్చి పడుతోంది. కరోనా నుంచి కోలుకున్నాం అనే ఆనందం బాధితుల్లో లేకుండా పోతోంది. అవును.. కరోనా తీవ్రత తగ్గినా, ఆ ప్రభావం మాత్రం అనేక రూపాల్లో పీడిస్తూనే ఉంది.
కరోనా నుంచి కోలుకున్న వారిలో ఇప్పటి వరకు బ్లాక్ ఫంగస్ ( mucormycosis ), డిమైలినేషన్ వంటి సమస్యలు మాత్రమే వెలుగుచూశాయి. ఇప్పుడు మరో రోగం కాచుకుని కూర్చుంది. దాని పేరే.. ‘బోన్ డెత్’. దీనినే ‘ఎవాస్క్యులర్ నెక్రోసిస్ ఆఫ్ ది హిప్ జాయింట్’ (ఏవీఎన్) అనీ అంటారు. కొవిడ్ నుంచి కోలుకున్న 60 రోజుల తర్వాత కొంతమందిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక ‘బోన్ డెత్’ కేసులు నమోదయ్యాయి.
బోన్ డెత్ అంటే.. వాడుక భాషలో.. ఎముకలు కుళ్లిపోవడం. వైద్య పరిభాషలో ‘ఎవాస్క్యులర్ నెక్రోసిస్’ అంటారు. సాధారణంగా ఈ వ్యాధి తుంటికీళ్లలో(హిప్ జాయింట్స్‌లో) వస్తుంది. దీనికో కారణం ఉంది. శరీరంలోని ఇతర భాగాలతో పోలిస్తే, హిప్ జాయింట్స్‌లో రక్తప్రసరణ తక్కువ. కొవిడ్ చికిత్సలో వాడే స్టెరాయిడ్స్ ప్రభావం వల్ల రోగి శరీరంలో రక్తప్రసరణ తగ్గిపోతుంది. దీంతో, అంతంతమాత్రంగా రక్తప్రసరణ ఉన్న హిప్ జాయింట్స్‌కు ఒక్కసారిగా సరఫరా నిలిచిపోతుంది. ఫలితంగా, తుంటి కీళ్లలోని ఎముక కణాలు నశిస్తాయి. అక్కడున్న ఎముకలు క్రమంగా కుళ్లిపోతాయి. ఈ స్థితే.. ‘బోన్ డెత్’!
కొవిడ్ చికిత్సలో భాగంగా వాడే స్టెరాయిడ్స్‌వైపే వేలెత్తి చూపుతున్నారు నిపుణులు. ఎక్కువ రోజులు వెంటిలేటర్‌పై చికిత్స పొందడం మరో కారణం. సాధారణంగా, కొవిడ్ బారిన పడని రోగుల్లో 2000ఎంజీ కంటే ఎక్కువగా (చికిత్సాకాలం మొత్తంలో) స్టిరాయిడ్స్ వాడితే, బోన్ డెత్ సమస్య వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ, కరోనా రోగుల్లో మాత్రం 750ఎంజీ నుంచి 850 ఎంజీ (చికిత్సాకాలం మొత్తంలో) స్టెరాయిడ్స్ వాడినా బోన్ డెత్ లక్షణాలు కనిపిస్తున్నాయి. సాధారణ రోగుల్లో స్టెరాయిడ్స్ వాడిన రెండేళ్ల తర్వాత బోన్ డెత్ సమస్య తలెత్తితే.. కరోనా రోగుల్లో 60 తరువాతే వస్తోంది. స్టెరాయిడ్స్‌తో సంబంధం లేకుండా కూడా కొందరిలో బోన్ డెత్ సమస్య ఉత్పన్నం అవుతున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే, స్టెరాయిడ్స్ వాడకపోయినా కరోనా రోగులకు ఈ వ్యాధి వస్తుందా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.
ఇప్పటి వరకూ కనిపించిన కేసుల్లో మాత్రం స్టెరాయిడ్స్ వాడిన కరోనా రోగులే బోన్ డెత్ బారిన పడ్డారు. కరోనాతో సంబంధం లేని సాధారణ రోగుల వైద్యచరిత్రను పరిశీలిస్తే.. మహిళల్లో ఆటోఇమ్యూన్ సిస్టం దెబ్బతినడం వల్ల తలెత్తే ‘సిస్టమిక్ లూపస్ ఎర్తమటోసిస్'(ఎస్‌ఎల్‌యీ) అనే రుగ్మతవల్ల కూడా బోన్ డెత్ రావచ్చు. పురుషుల్లో దీర్ఘకాల మద్యపానం, ధూమపానం ఓ కారణం కావచ్చు. కొందరికి రోడ్డు ప్రమాదాల్లో తుంటిఎముకలు గాయపడతాయి. సరైన సమయంలో, సరైన చికిత్స తీసుకోలేకపోతే అది కాస్తా బోన్ డెత్‌గా పరిణమించవచ్చు. చిన్నప్పుడు తగిలిన దెబ్బల వల్ల కూడా, బోన్ డెత్ బారినపడే ప్రమాదం ఉంది. మూత్రపిండ మార్పిడి జరిగిన రోగులూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తమా వ్యాధిగ్రస్తులు, చర్మవ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు కూడా రెండు నుంచి ఐదు శాతం మేర ఈ రుగ్మతకు చేరువలో ఉన్నట్టే.
బోన్ డెత్… అదృశ్య శత్రువులా చొచ్చుకొస్తుంది. క్రమంగా తన నిజరూపాన్ని ప్రదర్శిస్తుంది. అంతలోపే రోగి మేల్కొనాలి. ఆ దాడిని అడ్డుకోవాలి.
మొదటి దశ: ఎముకలోని కణాలన్నీ నిర్జీవంగా మారడం మొదలవుతుంది. ఈ దశలో ఎముక 25 శాతం వరకూ దెబ్బతింటుంది. ఇప్పుడే కనుక వ్యాధిని గుర్తిస్తే, సాధారణ ఔషధాలతో రోగికి ఉపశమనం కలిగించవచ్చు. వ్యాధి ముదరకుండా అడ్డుకోవచ్చు.
రెండో దశ: ఎముక 25 శాతం నుంచి 50 శాతం వరకు కుళ్లిపోతుంది. వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అయినా మించి పోయింది లేదు. ఈ దశలో వైద్యం చేయించుకొంటే శస్త్రచికిత్స లేకుండానే నయం చేయవచ్చు. ఈ రెండు దశలూ ప్రమాదకరమే కానీ, ప్రాణాంతకం కాదు.
మూడో దశ: ఎముక 50 శాతం నుంచి 75 శాతం వరకు కుళ్లిపోతుంది. ఈ దశలో భరించలేనంత నొప్పితో రోగి బాధపడతాడు. అడుగు తీసి అడుగేయలేని పరిస్థితి.
నాలుగో దశ: తుంటికీలు ఎముక 100 శాతం కుళ్లిపోతుంది. ఆ ఎముకకు సంబంధించినంత వరకూ అది మరణమే. తుంటికీళ్లు పనిచేయడం ఆపేస్తాయి. రోగికి వీల్ చైరే సర్వస్వం అవుతుంది.
లక్షణాలు: కరోనా నుంచి కోలుకున్న 60 రోజుల తరువాత గజ్జలలో నొప్పి మొదలవుతుంది. విపరీతమైన నడుం నొప్పి ఇబ్బంది పెడుతుంది. నిలబడలేరు, నడవలేరు, కిందికి వంగలేరు. తుంటిలో విపరీతమైన బాధ.
కరోనా నుంచి కోలుకున్న రెండు మూడు నెలల్లోపు ఎముకలకు సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా, నిర్లక్ష్యం చేయకుండా నిపుణులను సంప్రదించాలి. తుంటి పరిసరాల్లో ఎక్స్-రే లేదా ఎంఆర్‌ఐ చేయిస్తే సమస్య తీవ్రత తెలుస్తుంది. అప్పటికి ఇంకా స్టెరాయిడ్స్ వాడుతుంటే, వెంటనే నిలిపేయాలి. లేదంటే మోతాదు తగ్గించాలి. ఈ విషయంలో నిపుణులదే తుది నిర్ణయం. షుగర్, బీపీ, రుమటాయిడ్ ఆర్తరైటిస్ వంటి సమస్యలుంటే, వాటిని నియంత్రణలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ‘బై ఫాస్పోనెట్’ మాత్రలను 3 నుంచి 6 నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.
”బోన్ డెత్ రోగులకు సాధారణ వైద్యానికి ప్రత్యామ్నాయంగా పీఆర్‌పీ (ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా) ఇంజక్షన్స్ కూడా ఇస్తారు. ప్రస్తుతానికి కొన్ని హాస్పిటల్స్‌లో మాత్రమే ఈ విధానం అందుబాటులో ఉంది. రోగి శరీరంలోని ఎముక నుంచి రక్తం తీసి, దాన్ని ‘సెంట్రిఫ్యూజ్’ చేయడం వల్ల అందులో కొత్త ప్లేట్‌లెట్స్ తయారవుతాయి. అలా తయారైన వాటిని తిరిగి ఆ రోగికే ఎక్కిస్తారు. మూడు, నాలుగు దశల్లో అయితే, కోర్ డీకంప్రెషన్ శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ చికిత్సలో సక్సెస్ రేటు 40 శాతం మాత్రమే. ఇది విఫలమైతే హిప్ రిప్లేస్‌మెంట్ ఒక్కటే మార్గం. అత్యాధునిక వైద్య విధానాలతో ఆ శస్త్రచికిత్సనూ విజయవంతంగా పూర్తిచేయవచ్చని” వైద్య నిపుణులు అన్నారు.