రోడ్డు రవాణా శాఖ కొత్త ప్రతిపాదన.. పిల్లలతో ప్రయాణిస్తూ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించారో.. 

మెరిట్, డీమెరిట్ పాయింట్ల వ్యవస్థను కూడా అధికారులు ప్రతిపాదించారు. ట్రాఫిక్ నియమాలు పాటించే వారికి పాజిటివ్ పాయింట్లు, ఉల్లంఘించే వారికి నెగటివ్ పాయింట్లు కేటాయించనున్నారు.

పిల్లలతో ప్రయాణిస్తూ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే డ్రైవర్లు రెండింతల జరిమానా, లైసెన్స్ రద్దు వంటి వాటిని ఎదుర్కొనేలా చర్యలు తీసుకోవాలని రోడ్డు రవాణా శాఖ భావిస్తోంది. ఈ మేరకు మోటార్ వాహన చట్టానికి రోడ్డు రవాణా శాఖ సవరణలు ప్రతిపాదిస్తోంది.

చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా, తల్లిదండ్రులు, గార్డియన్లు, స్కూల్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై బాధ్యత పెంచే లక్ష్యంతో ఈ ప్రతిపాదన చేస్తోంది. ప్రైవేటు, స్కూల్ వాహనాలకే కాకుండా, స్కూల్‌లు అద్దెకు తీసుకునే వాహనాలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. డ్రైవర్‌తో పాటు వాహన యజమాని బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలపై ప్రస్తుతం వివిధ మంత్రిత్వశాఖల అభిప్రాయాలను తీసుకుంటున్నారు.

Also Read: సినిమా రచయిత రాసినట్టు ఇష్టానుసారం దీనిలో పాత్రలు సృష్టిస్తున్నారు: సజ్జల

డ్రైవర్ తీరును ట్రాక్ చేసే కొత్త పాయింట్ల వ్యవస్థ
మెరిట్, డీమెరిట్ పాయింట్ల వ్యవస్థను కూడా అధికారులు ప్రతిపాదించారు. ట్రాఫిక్ నియమాలు పాటించే వారికి పాజిటివ్ పాయింట్లు, ఉల్లంఘించే వారికి నెగటివ్ పాయింట్లు కేటాయించనున్నారు. డీమెరిట్ పాయింట్లు పరిమితికి మించి పెరిగితే, లైసెన్స్ తాత్కాలికంగా లేదా శాశ్వతంగా రద్దయ్యే అవకాశం ఉంటుంది.

ఈ పాయింట్ల ఆధారంగా వాహన బీమా ప్రీమియాన్ని కూడా నిర్దారించే అవకాశముంది. నిబంధనలకు అనుకూలంగా డ్రైవింగ్ చేస్తే తక్కువ బీమా, తప్పులు చేస్తే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

మరో ప్రతిపాదన కూడా ఉంది. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినవారు లైసెన్స్ రీన్యూవల్ కోసం అప్లై చేస్తే, వారికి డ్రైవింగ్ టెస్ట్ తప్పనిసరి కావచ్చు.

అయితే, ఈ ప్రతిపాదనల ప్రయోజనాలపై రోడ్డు భద్రతా నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. “ప్రస్తుతం అతి వేగంగా, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, సిగ్నల్ దాటడం, ఫోన్ వాడడం, సీట్‌బెల్ట్ లేకపోవడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కొన్ని తప్పులకే పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. కానీ, మోటార్ వాహన చట్టంలో 100 కంటే ఎక్కువ రకాల నిబంధనలు ఉన్నాయి” అని నిపుణులు తెలిపారు.

“పిల్లలు వెనుక సీట్లో కూర్చున్నారన్న విషయాన్ని కెమెరాలు గుర్తిస్తాయా? వాహనాన్ని ఆపి పోలీసులు లోపల ఉన్న వారి వయసు చెక్ చేస్తారా? విధానాలు, చట్టాలు రూపొందించేప్పుడు దేశం మొత్తం కాకుండా ఢిల్లీ, ముంబై, చెన్నైపై మాత్రమే దృష్టి ఉంటుంది” అని కూడా వారు చెప్పారు.

వాస్తవంగా చిన్న పట్టణాలు, గ్రామాల్లో నిబంధనల అమలు పరిమితంగా ఉండే అవకాశం ఉందన్నది వారి వాదన. చట్టంలో మార్పులు ప్రతిపాదించినా, అమలులోకి ఎలా వస్తాయన్నదే కీలకమైన విషయం. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు మంత్రిత్వశాఖల సమీక్ష దశలో ఉన్నాయి.