Kavitha : ధైర్యంగా ఉండండి, మేము మీతోనే ఉన్నాము.. చెన్నైలో వర్ష బీభత్సంపై కవిత ట్వీట్

ఎడతెరిపి లేని వర్షాలతో చెన్నై నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. నగరంలోని సబ్ వేలు నీట మునిగాయి. ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్లలోకి వరద నీరు చేరింది.

Kavitha On Chennai Rains (Photo : Google)

చెన్నై నగరంలో వర్ష బీభత్సంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఎక్స్ లో పోస్టు పెట్టారు. భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని చెన్నై నగరవాసులకు సూచించారు. చెన్నై నగరంపై మిచాంగ్ తుపాను ప్రభావం పట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నై ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రార్థించారు. స్టే స్ట్రాంగ్ చెన్నై.. మేము మీతో ఉన్నాము.. అంటూ ధైర్యం చెప్పారు కవిత.

కాగా, మిచాంగ్ తుపాను ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నై నగరంలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో చెన్నై నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. నగరంలోని సబ్ వేలు నీట మునిగాయి. ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్లలోకి వరద నీరు చేరింది. పలు విమానాలు, రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కుండపోత వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరద నీటిలో కార్లు కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తుపాను ప్రభావంతో కురుస్తున్న కుండపోత వానలకు చెన్నై నగరం చిగురుటాకులా వణుకుతోంది. భారీ వర్షాలతో జనజీవనం స్థంభించింది. అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.

Also Read : తీవ్ర తుపానుగా మిచాంగ్.. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. విమాన సర్వీసులు రద్దు

భారీ వర్షాలతో చెన్నై ఎయిర్ పోర్టు వరద నీటితో నిండిపోయింది. విమానాల టైర్లు నీటిలో మునిగిపోయాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరద నీరు చేరడంతో విమాన రాకపోకలను నిలిపేశారు. ఎయిర్ పోర్టును మూసివేశారు. కాగా, రానున్న 24 గంటలు చెన్నైలో భారీ వర్షాలు కొనసాగుతాయని అధికారులు చెప్పడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

తమిళనాడును వర్షాలు వణికిస్తున్నాయి. ఇప్పటికే రెండు రోజులుగా దంచికొడుతున్న వానలతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తిరువళ్లూరు, కాంచీపురం, చెన్నై ప్రాంతాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు