Aamchur Jail: వ్యాపారి కొంప ముంచిన మామిడికాయ పొడి, గరం మసాలా.. 57 రోజులు జైల్లో..
భద్రతా తనిఖీల్లో భాగంగా అజయ్ బ్యాగ్‌ను స్క్రీనింగ్ మిషన్‌లోకి పంపారు. అంతే, మిషన్ ఒక్కసారిగా అరవడం మొదలు పెట్టింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అతడి బ్యాగ్‌ను ఓపెన్ చేసి చూశారు.
Aamchur Jail: కొన్నిసార్లు మన తప్పేమీ లేకపోయినా ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. మనం చెప్పేది నిజమే అయినా అవతలి వారికి నమ్మకం కలగకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అపోహలు, అత్యుత్సాహం తీవ్ర అనర్థాలకు దారితీస్తున్నాయి. తాజాగా ఒక వ్యాపారి విషయంలో అదే జరిగింది. చేయని తప్పునకు అతడు జైలుకి వెళ్లాల్సి వచ్చింది. మామిడికాయ పొడి, గరం మసాల అతడి కొంప ముంచాయి. అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లేలా చేశాయి.
ఎయిర్ పోర్ట్ లగేజీలో ఆమ్చూర్ (మామిడి కాయ పొడి), గరం మసాలా దొరికినందుకు ఒక వ్యాపారవేత్త 57 రోజులు జైల్లో గడపాల్సి వచ్చింది. అదొక మత్తు పదార్ధంగా భావించిన ఎయిర్ పోర్టు అధికారులు ఆ వ్యాపారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ వింత కేసు ఇప్పుడు విమానాశ్రయ తనిఖీలు, చట్టపరమైన విధానాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. అంతర్జాతీయంగా ఆహార పదార్థాలను తీసుకెళ్లే ప్రయాణికుల కోసం మరింత స్పష్టమైన నియమాలు ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది.
2010 మే 7వ తేదీన వ్యాపారవేత్త అజయ్ సింగ్ మలేషియా వెళ్లేందుకు భోపాల్ నుండి ఢిల్లీకి జెట్ ఎయిర్వేస్ విమానం ఎక్కడానికి సిద్ధమవుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
మామిడికాయ పొడిని మత్తు పదార్ధం అనుకుని..
అజయ్ సింగ్ భోపాల్ విమానాశ్రయానికి వెళ్లగా.. భద్రతా తనిఖీల్లో భాగంగా అజయ్ బ్యాగ్‌ను స్క్రీనింగ్ మిషన్‌లోకి పంపారు. అంతే, మిషన్ ఒక్కసారిగా అరవడం మొదలు పెట్టింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అతడి బ్యాగ్‌ను ఓపెన్ చేసి చూశారు. అందులో తెల్లటి పొడి కనిపించింది. అంతే, ఎయిర్పోర్ట్ అధికారులు మరో ఆలోచన లేకుండా కేవలం టెక్నాలజీ ఆధారంగా అది అంతర్జాతీయ మార్కెట్ లో నిషేధించబడిన మత్తు పదార్థం అని తేల్చేశారు. వారు అలా అనడంతో అజయ్ సింగ్ బిత్తరపోయాడు. అది డ్రగ్ కాదని వంటల్లో వాడే పొడి అని నెత్తీ నోరు బాదుకున్నాడు.
బ్రాండెడ్ ఆమ్చూర్ పౌడర్ (మామిడి కాయ పొడి), గరం మసాలా అని గొంతు చించుకున్నాడు. కానీ, అధికారులు వినిపించుకోలేదు. ఆ తెల్ల పొడి ఎక్స్‌ప్లోజివ్ ట్రేస్ డిటెక్టర్ (ETD) యంత్రంలో హెచ్చరికలను పంపిందని, ఆ ప్యాకెట్లలో హెరాయిన్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (NDPS) చట్టం పరిధిలోకి వచ్చే సైకోట్రోపిక్ పదార్థమైన MDEA ఆనవాళ్లు ఉన్నాయని భద్రతా సిబ్బంది అనుమానించారు.
ల్యాబ్ రిపోర్టులో బయటపడ్డ నిజం..
అతడిపై నార్కోటిక్స్ సెషన్స్ కింద కేసులు పెట్టి జైలుకి కూడా పంపారు. ఆ తర్వాత ఆ నమూనాలను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపారు. అజయ్ సింగ్ జైలుకెళ్లిన 57 రోజుల తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది. అది చూసి అధికారులకు దిమ్మతిరిగిపోయింది. ఆ ప్యాకెట్లలో ఎలాంటి మాదక ద్రవ్యం లేదా నిషేధిత పదార్థం లేదని రిపోర్టు నిర్ధారించింది. అందులో ఉన్నది డ్రగ్స్ కాదు సాదాసీదా ఆమ్చూర్ పౌడర్ (మామిడికాయ పొడి) అని రిపోర్టులో స్పష్టంగా తేలింది. దీంతో అజయ్ సింగ్ ను జైలు నుంచి విడుదల చేశారు. 57 రోజులు జైల్లో గడిపిన అజయ్ సింగ్ చివరకు జూలై 2, 2010న విడుదలయ్యాడు. ఆ తర్వాత ఒక ప్రత్యేక ఎన్డిపిఎస్ కోర్టు ఈ విషయంలో ముగింపు నివేదికను ఆమోదించింది.
జైలు నుంచి బయటకు వచ్చిన అజయ్ సింగ్ ఊరుకోలేదు. మిషన్ రీడింగ్‌పై ఆధారపడి తనను అన్యాయంగా జైలుకి పంపారని మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. 16 ఏళ్ల పాటు సాగిన న్యాయపోరాటం తర్వాత హైకోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఏ తప్పూ చేయకుండానే 57 రోజులు జైలు శిక్ష అనుభవించిన అజయ్ సింగ్ కి 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర యంత్రాంగం, ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలు విఫలమవడం వల్ల అతని ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయన్న కోర్టు.. రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌లను తనిఖీ చేయాలని కోర్టు ఆదేశించింది.
రాష్ట్ర ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలు సరిపోవని, వ్యాపారవేత్త సుదీర్ఘకాలం జైల్లో ఉండటానికి ఇది నేరుగా దోహదపడిందని జస్టిస్ దీపక్ ఖోట్ వ్యాఖ్యానించారు. విమానాశ్రయంలో ఉపయోగించిన ఈటీడీ (ETD) యంత్రం కేవలం సూచిక మాత్రమేనని, నిషేధిత వస్తువులకు అది నిశ్చయాత్మకమైన రుజువు కాదని కోర్టు పేర్కొంది. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో సాధారణంగా ఉపయోగించే సుగంధ ఆహార పదార్థాల కోసం దిగుమతి చేసుకున్న డిటెక్షన్ సిస్టమ్ లను క్యాలిబ్రేట్ చేయనందున అనేక భారతీయ మసాలా ఉత్పత్తులు తప్పుడు పాజిటివ్ ఫలితాలను ఇవ్వగలవని కూడా వాదించారు. అయితే ఈ ఘటనకు విమానాశ్రయ అధికారులను గానీ, యంత్ర తయారీదారుని గానీ హైకోర్టు నేరుగా బాధ్యులుగా పరిగణించలేదు. దానికి బదులుగా, ఒక వ్యక్తిని ఇంత సుదీర్ఘ కాలం పాటు జైల్లో ఉంచే ముందు, సరైన ఫోరెన్సిక్ నిర్ధారణను త్వరితగతిన నిర్వహించి ఉండాల్సిందని కోర్టు నొక్కి చెప్పింది.
