నేను బతికున్నంత వరకు సీఏఏ అమలు కానివ్వను : మమతా బెనర్జీ

తాను బతికున్నంత వరకు పశ్చిమ బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు కానివ్వబోనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.

  • Published By: veegamteam ,Published On : December 28, 2019 / 04:37 AM IST
నేను బతికున్నంత వరకు సీఏఏ అమలు కానివ్వను : మమతా బెనర్జీ

Updated On : December 28, 2019 / 4:37 AM IST

తాను బతికున్నంత వరకు పశ్చిమ బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు కానివ్వబోనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.

తాను బతికున్నంత వరకు పశ్చిమ బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు కానివ్వబోనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. పౌరసత్వం సహా ఏ ఇతర హక్కులను ఎవరూ కాలరాయలేరని ఆమె స్పష్టం చేశారు. సీఏఏపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ ఆమె ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 

దేశంలో సీఏఏకి వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు తాను మద్దతిస్తున్నట్లు మమత ప్రకటించారు. 18 ఏళ్లు దాటిన యువకుడు ప్రభుత్వాన్ని ఎన్నుకోవచ్చు గానీ, ఆందోళన చేసే హక్కు ఎందుకు ఉండకూడదని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఏఏ అమలు చేసేది లేదని, ఏ ఒక్కరూ దేశాన్ని గానీ, రాష్ట్రాన్ని గానీ విడిచి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. బెంగాల్‌లో ఎలాంటి నిర్బంధ కేంద్రాలూ ఉండబోవని మమత స్పష్టం చేశారు.  

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు నిరసన చేపట్టారు. కొందరు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నివాసం ముట్టడికి యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనల నేపథ్యంలో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసినప్పటికీ.. భీమ్‌ ఆర్మీ కార్యకర్తలు సహా వందలాది మంది నిరసనకారులు తమ చేతులు కట్టేసుకుని ర్యాలీ చేపట్టారు. 

పౌరసత్వ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ర్యాలీ జరిగింది. జోర్‌బాగ్‌ నుంచి లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసం వైపు బయల్దేరారు. అయితే మార్గమధ్యంలో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళల దృష్ట్యా లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ మెట్రో స్టేషన్‌ గేట్లను అధికారులు మూసివేశారు. ఇక  సీఏఏకు వ్యతిరేకంగా జామా మసీదు దగ్గర కూడా నిరసనలు జరిగాయి.