Justice Yashwant Varma : జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కలకలం.. ఎవరీ యశ్వంత్ వర్మ?

2006 నుండి అక్కడి బెంచ్‌కు నియమించబడే వరకు ఆయన అలహాబాద్ హైకోర్టు ప్రత్యేక న్యాయవాదిగా కూడా పనిచేశారు.

Justice Yashwant Varma : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో నోట్ల కట్టల వ్యవహారం సంచలనంగా మారింది. ఆయన ఇంట్లో భారీగా డబ్బు దొరకడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరగడంతో భారీగా నగదు బయటపడింది. ఇది లెక్కల్లో చూపని డబ్బు కావడంతో వివాదం రాజుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం న్యాయవ్యవస్థను కుదిపేస్తోంది. అసలు ఎవరీ యశ్వంత్ వర్మ? అనేది హాట్ టాపిక్ గా మారింది.

గతంలో ఆయన అలహాబాద్ హైకోర్టులో ఉండేవారు. అక్కడి నుంచి ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు. అక్టోబర్ 2021 నుంచి ఢిల్లీ కోర్టులో ఉన్నారు. జస్టిస్ వర్మ తొలుత అక్టోబర్ 2014లో అలహాబాద్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. రెండేళ్ల తర్వాత అంటే 2016లో ఆ కోర్టు శాశ్వత మెంబర్ గా ప్రమాణం చేశారు.

ఢిల్లీ హైకోర్టు వెబ్ సైట్ ప్రకారం.. యశ్వంత్ వర్మ 1969 జనవరి 6న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్ లో(ఇప్పుడు ప్రయాగ్ రాజ్) జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ హన్స్ రాజ్ కాలేజీలో బీకామ్ హానర్స్ చదివారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ బీ అందుకున్నారు. 1992 ఆగస్టు 8న అలహాబాద్ హైకోర్టులో అడ్వకేట్ గా ఎన్ రోల్ చేసుకున్నారు.

Also Read : అసెంబ్లీలో హనీట్రాప్ దుమారం.. మంత్రులు సహా 48మంది నేతలపై వలపు వల.. సీడీలు, వీడియోలు కూడా..

ఢిల్లీ హైకోర్టు వెబ్ సైట్ ప్రకారం.. యశ్వంత్ వర్మ రాజ్యాంగం, కార్మిక వివాదాలకు సంబంధించిన విషయాలను, అలాగే పరిశ్రమలు, కార్పొరేషన్లు, పన్నులను నియంత్రించే చట్టాలను నిర్వహించారు.

2006 నుండి అక్కడి బెంచ్‌కు నియమించబడే వరకు, ఆయన అలహాబాద్ హైకోర్టు ప్రత్యేక న్యాయవాదిగా కూడా పనిచేశారు. తదనంతరం, ఆయన రాష్ట్ర చీఫ్ స్టాండింగ్ కౌన్సెల్‌గా కూడా పనిచేశారు.

ఢిల్లీలోని ఆయన ఇంట్లో లెక్కల్లో చూపని నగదు లభ్యం కావడంతో దుమారం రేగింది. ఆయన ఇంట్లో అగ్నిప్రమాదం జరగ్గా.. మంటలను ఆర్పడానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి భారీగా డబ్బు దొరికింది.

జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపడంతో సుప్రీంకోర్టు కొలీజియం తీవ్రంగా స్పందించింది. జస్టిస్ వర్మను తిరిగి ఆయన మాతృ కోర్టుకు అంటే అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఈ విషయంపై చాలా అస్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీయకుండా చర్యలు తీసుకోవాలని కొలీజియం కోరిందని వర్గాలు తెలిపాయి. అలాగే ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణకు కూడా ఆదేశించినట్లు సమాచారం.