Honeytrap: అసెంబ్లీలో హనీట్రాప్ దుమారం.. మంత్రులు సహా 48మంది నేతలపై వలపు వల.. సీడీలు, వీడియోలు కూడా..

గతవారం ఓ బీజేపీ నేతపై జరిగిన హనీట్రాప్ ప్రయత్నం తీవ్ర చర్చనీయాంశమైంది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన ఓ మహిళ..

Honeytrap: అసెంబ్లీలో హనీట్రాప్ దుమారం.. మంత్రులు సహా 48మంది నేతలపై వలపు వల.. సీడీలు, వీడియోలు కూడా..

Honey-Trap

Updated On : March 21, 2025 / 8:03 AM IST

Honeytrap Case: ఈ మధ్యకాలంలో మనం తరచుగా హనీట్రాప్ అనే పేరును వింటూనే ఉన్నాం. ఇప్పుడీ హనీట్రాప్ వలలో సుమారు 48మంది మంత్రులు సహా ఎమ్మెల్యేలు చిక్కుకున్నారని అసెంబ్లీలో మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ అంశంపై దుమారం చెలరేగింది. విచారణ చేపట్టాలని అధికార, విపక్ష పార్టీల నేతలు పట్టుబట్టారు. దీంతో ఇప్పటికే ఈ హనీట్రాప్ పై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది.

 

కర్ణాటక అసెంబ్లీలో హనీట్రాప్ దుమారం చెలరేగింది. రాజకీయ నేతలను హనీట్రాప్ భయం వెంటాడుతోంది. తనపై రెండుసార్లు హనీట్రాప్ ప్రయత్నాలు జరిగాయని కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎస్ రాజన్న అన్నారు. అంతేకాక.. ఈ వ్యవహారంలో తనకు తెలిసే 48 మంది చిక్కుకుని ఉన్నారని అసెంబ్లీలో ప్రకటించడం తీవ్ర దుమారం రేపింది.

 

మంత్రి మాట్లాడుతూ.. తన దగ్గరున్న సమాచారం ప్రకారం మొత్తం 48 మంది రాజకీయ నేతలు హనీట్రాప్ వలలో చిక్కుకున్నారు. ఇది కొత్త విషయంకాదు. వాటిని బయటపెట్టకుండా కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చిన నాయకులు చాలా మంది ఉన్నారంటూ పేర్కొన్నారు. ఇప్పుడు నాపేరు ప్రస్తావనకు వచ్చింది. ఇదే అంశంపై ఫిర్యాదు చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. హనీట్రాప్ సూత్రదారులు, పాత్రదారులెవరో తెలుసుకోవాలని అన్నారు. రాజకీయ లబ్ధికోసమే ఇదంతా చేశారని పేర్కొన్నారు. వాళ్లకు సంబంధించిన సీడీలు, పెన్ డ్రైవ్ లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన విషయం కాదన్నారు.

 

బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సభలో మాట్లాడుతూ.. ప్రభుత్వమే హనీట్రాప్ ఫ్యాక్టరీ నిర్వహిస్తుందా అంటూ ప్రశ్నించారు. దీనిపై హోం మంత్రి పరమేశ్వర్ మాట్లాడుతూ.. హనీట్రాప్ అనుమానాలున్న సభ్యులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు. మరోవైపు ఇదే వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. ఎవరినైనా అరెస్టు చేశారో లేదోనన్న విషయం తనకు తెలియదన్నారు. దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు.

 

ఇదిలాఉంటే… గతవారం ఓ బీజేపీ నేతపై జరిగిన హనీట్రాప్ ప్రయత్నం తీవ్ర చర్చనీయాంశమైంది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన ఓ మహిళ.. అసభ్యకర వీడియోలతో తనను బ్లాక్ మెయిల్ చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.