Aadhaar Linking: ఓటర్ కార్డుకు ఆధార్ లింక్.. అనుమతి కోసం UIDAIకి కేంద్రం లేఖ
కేంద్ర ప్రభుత్వం దేశంలో ఓటరు గుర్తింపు కార్డులను కూడా రూపొందించడానికి ఆధార్‌ని ఉపయోగించాలని అనుకుంటోంది.

Aadhar Link
Aadhaar Linking: కేంద్ర ప్రభుత్వం దేశంలో ఓటరు గుర్తింపు కార్డులను కూడా రూపొందించడానికి ఆధార్‌ని ఉపయోగించాలని అనుకుంటోంది. కొత్త ఓటర్ల నమోదు కోసం ఆధార్‌ని ఉపయోగించడానికి ఎన్నికల సంఘాన్ని అనుమతించాలని కోరుతూ ఆధార్ తయారీ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) కి కేంద్రం లేఖ రాసింది. ఆధార్ వెరిఫికేషన్ (సోషల్ వెల్ఫేర్, ఇన్నోవేషన్ మరియు నాలెడ్జ్) రూల్స్ 3, 2020 ప్రకారం సుపరిపాలన కోసం, e-EPIC (ఎలక్ట్రానిక్ ఓటర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్) లేదా ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేయడానికి అనుమతించవచ్చని ప్రభుత్వం లేఖలో వెల్లడించింది.
ఈ నిబంధనలను ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గత ఏడాది ఆగస్టు 5 న నోటిఫై చేసింది. దీని లక్ష్యం ‘సుపరిపాలన, ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని నిరోధించడం, పౌరుల జీవితాన్ని సులభతరం చేయడం మరియు వారికి ఇచ్చే సేవలను మెరుగుపరచడం అని చెబుతున్నారు. ఈ ఫంక్షన్ల కోసం ఏదైనా డిపార్ట్‌మెంట్ ఆధార్‌ని ఉపయోగించాలని అనుకుంటే, అందుకోసం UIDAI కి ప్రతిపాదన పంపాలి.
ఇప్పుడు ఈ విషయంపై UIDAI ప్రభుత్వం ప్రతిపాదనను అంగీకరిస్తే, ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950 మరియు ఆధార్ చట్టం, 2016 కి సవరణలు లేకుండా ఓటరు కార్డుతో ఆధార్‌ని లింక్ చేసే మార్గం సుగమం అవుతుంది. ఆగస్టు 2019లో, ఎన్నికల సంఘం ప్రజా ప్రతినిధుల చట్టం మరియు ఆధార్ చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ లా సెక్రటరీకి లేఖ రాసింది, తద్వారా ఓటరు జాబితా నుంచి నకిలీ వ్యక్తులను తొలగించడానికి చర్యలు తీసుకోవచ్చు. ఓటరు కార్డుతో ఆధార్‌ని అనుసంధానం చేస్తే, బోగస్ ఓటర్లను మినహాయించవచ్చని కమిషన్ వెల్లడించింది.
హెచ్‌ఎస్ బ్రహ్మ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు 2015 ఫిబ్రవరిలో ఆధార్‌ను EPICతో అనుసంధానం చేసే ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. అయితే సుప్రీంకోర్టు ఆధార్‌ను పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(PDS) మరియు LPG మరియు కిరోసిన్ పంపిణీని పరిమితం చేసింది. అప్పటివరకు ఎన్నికల సంఘం 38 కోట్ల ఓటర్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసింది.
కమిషన్ డిమాండ్‌ని నెరవేర్చడానికి క్యాబినెట్ ఆమోదం కోసం గతంలో న్యాయ మంత్రిత్వ శాఖ సూచించినప్పటికీ, చట్టాన్ని సవరించకుండా ప్రభుత్వం ఓటరు కార్డును ఆధార్‌తో లింక్ చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అర్థం అవుతోంది. ఓటు హక్కు పరిరక్షణకు వీలుగా ఆధార్‌తో ఓటరు ఐడీని అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.