Temple Chariot Collapsed : బాబోయ్.. జాతరలో ఒక్కసారిగా కుప్పకూలిన 150 అడుగుల రథం.. ఇద్దరు భక్తులు దుర్మరణం.. వీడియో వైరల్

ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. చాలామంది భక్తులు రథం కింద చిక్కుకున్నారు.

Temple Chariot Collapsed : కర్ణాటకలోని దొడ్డనగమంగళ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 150 అడుగుల ఎత్తైన భారీ రథం ఊరేగిస్తుండగా గాలి వాన సృష్టించిన బీభత్సంతో పక్కకు ఒరిగి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. భక్తులు రథాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తుండగా భారీ వర్షం, ఈదురు గాలులు బీభ్సతం సృష్టించాయి.

రథం వెంట వేల సంఖ్యలో భక్తులు ఉన్నప్పటికీ.. గాలి వాన కారణంగా అది పక్కకు ఒరిగిపోయింది. ప్రతిష్టాత్మక హుస్కూరు మద్దురమ్మ జాతరలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. చాలామంది భక్తులు రథం కింద చిక్కుకున్నారు. మృతులను తమిళనాడులోని హోసూరుకు చెందిన రోహిత్, బెంగళూరులోని కెంగేరీకి చెందిన జ్యోతిగా గుర్తించారు.

 

ప్రతి ఏటా మద్దురమ్మ ఆలయ జాతర నిర్వహిస్తారు. ఇందులో భాగంగా రథాలను ఊరేగింపుగా తీసుకెళ్తారు. సాంప్రదాయ ఆచారంలో భాగంగా భక్తులు భారీ రథాన్ని ఆలయం వైపు లాగుతుండగా, బలమైన గాలులు, భారీ వర్షం కారణంగా అది బ్యాలెన్స్ కోల్పోయి పక్కకు ఒరిగింది. అంతే ఒక్కసారిగా నేలపై కూలిపోయింది. గత సంవత్సరం కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఇదే ఉత్సవంలో ఒక రథం బోల్తా పడి, పార్క్ చేసిన అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ఆ సందర్భంలో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు లేవు.

Also Read : ఊబకాయం, మధుమేహం బాధితులకు శుభవార్త.. ఒక్క ఇంజెక్ష‌న్‌తో రెండింటినీ నియంత్రించొచ్చు..

భారీ రథం పక్కకు ఒరిగి ఒక్కసారిగా కూలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనతో ఉత్సవ నిర్వాహకులు, కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన స్థానిక అధికారులపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. రథం రూపకల్పనలోని నిర్మాణ లోపాలను ఎత్తి చూపారు. భారీ రథం కుప్పకూలడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గట్టిగా కేకలు వేస్తూ ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరుగులు తీశారు.

హుసూరు మద్దురమ్మ ఆలయ ఉత్సవం ఈ ప్రాంతంలో ఒక ముఖ్యమైన కార్యక్రమం. దీనికి 10 కి పైగా గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో జనం వస్తారు. వార్షిక ఊరేగింపు సమయంలో మతపరమైన వేడుకలో భాగంగా భారీ రథాలను లాగుతారు.