ఊబకాయం, మధుమేహం బాధితులకు శుభవార్త.. ఒక్క ఇంజెక్షన్‌తో రెండింటినీ నియంత్రించొచ్చు..
మీరు ఊబకాయంతో బాధపడుతున్నారా.. మధుమేహం కూడా ఉందా.. అలాంటి వారికి గుడ్ న్యూస్.. ఒక్క ఇంజెక్షన్ తో రెండింటిని నియంత్రించొచ్చు.

Mounjaro drug
Eli Lilly launches weight loss drug Mounjaro: మీరు ఊబకాయంతో బాధపడుతున్నారా.. మధుమేహం కూడా ఉందా.. అలాంటి వారికి గుడ్ న్యూస్.. ఒక్క ఇంజెక్షన్ తో రెండింటిని నియంత్రించొచ్చు. వారానికి ఒక్క ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే అటు బరువు తగ్గడంతోపాటు.. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో గుర్తింపు పొందిన ఈ ఔషదం.. తాజాగా భారత మార్కెట్లోకి అడుగు పెట్టింది.
భారతదేశంలో ఏటేటా ఊబకాయుల శాతం పెరిగిపోతోంది. తద్వారా మధుమేహం భారినపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. దేశంలో సుమారు 10కోట్ల మంది వరకు మధుమేహం బాధితులు ఉన్నట్లు అంచనా. ఇదే సమయంలో జనాభాలో 6.5శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. వీరిలో సగం మందికిపైగా ఎలాంటి చికిత్స తీసుకోవటం లేదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఊబకాయం, టైప్-2 మధుమేహం ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారికోసం ఓ ఇంజక్షన్ అందుబాటులోకి వచ్చింది.
ఊబకాయం, మధుమేహాన్ని నియంత్రించే ఔషధాన్ని అమెరికా ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ అభివృద్ధి చేసింది. బ్రిటన్, యూరప్ దేశాల్లో టిర్జెపటైడ్ అనే పేరుతో ఇప్పటికే అందుబాటులో ఉంది. భారతదేశం మార్కెట్లోకి మవుంజారో (టైర్జెపటైడ్) పేరుతో ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చింది. ఊబకాయంతోపాటు మధుమేహాన్ని ఏకకాలంలో నియంత్రించగల ఈ ఔషదం అనేక మంది బాధితులకు ఆశారేఖ కాగలదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
వారానికి ఒక ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే అటు బరువు తగ్గడంతోపాటు ఇటు మధుమేహాన్ని అదుపులో ఉంచే ఔషదాల్లో మొట్టమొదటిది మవుంజారో. ఇది గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులినో ట్రాపిక్ పాలీపెప్టైడ్ (జీఐపీ), గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ -1 (జీఎల్పీ-1) హార్మోన్ రెసెప్టార్ లను ప్రేరేపించడం ద్వారా బరువునూ, చెక్కెర మోతాదును నియంత్రిస్తుందని ఎలీ లిల్లీ కంపెనీ చెబుతోంది. స్థూలకాయంతోపాటు టైప్-2 మధుమేహం ఉన్నవారు ఈ ఔషదాన్ని తీసుకోవాలి. అయితే, ఈ ఔషదాన్ని వైద్యుల పర్యవేక్షణలో సరైన మోతాదులో వాడాలి.