Cid Inspector
CID Inspector జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్ సిటీ శివార్లలోని కానిపొరలో ఓ సీఐడీ ఇన్ స్పెక్టర్ ను ఉగ్రవాదులు కాల్చిచంపేశారు. సోపోర్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టిన ఒక రోజు అనంతరం ఆ ఘటన జరగడం గమనార్హం.
మంగళవారం సాయంత్రం నౌగామ్ ఏరియాలోని మసీదులో ప్రార్థనలు చేసి ఇంటికి తిరిగెళ్తున్న సీఐడీ ఇన్ స్పెక్టర్ పర్వేజ్ అహ్మద్ దార్‌పై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో పర్వేజ్ తీవ్రంగా గాయపడగా.. ఆయనని హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే పర్వేజ్ ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు చెప్పారని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పర్వేజ్ అహ్మద్ దార్..పరిమ్ పొరా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించేవాడని తెలిపారు. ఇక,ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు, దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు.