కాంగ్రెస్ కు రాహులే అధ్యక్షుడు ఉండాలి..సోనియాకు రక్తంతో లేఖ రాసిన లీడర్

కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు రాహుల్ గాంధీని నియమించాలని కోరుతూ ఓ లీడర్ సోనియా గాంధీకి రక్తంతో లేఖ రాయడం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన ఓ ఫొటో హల్ చల్ చేస్తోంది. ఢిల్లీలోని కంటోన్మెంట్ బోర్డ్ కౌన్సిలర్, కాంగ్రెస్ నేత సందీప్ తన్వార్ ఈ లేఖ రాశారు.
రాహుల్ గాంధీని పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా నియమంచాలని తాను రక్తతర్పణం చేసి అడుగుతున్నట్లు లేఖలో తెలిపారు. ఆయన అధ్యక్షుడు కాకపోతే..కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం మేలు చేయదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. తాను తాత్కాలిక అధ్యక్ష పదవిలో కొనసాగలేనని రాజీనామా చేశారు సోనియా. పార్టీకి చెందిన 23 మంది సీనియర్లు రాసిన లేఖ తర్వాత..ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆ పార్టీలో దుమారం రేపింది.
అనంతరం జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ యమ హాట్ హాట్ గా సాగింది. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ..ఏకంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం సీనియర్లకు నచ్చలేదు. రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామా చేస్తానంటూ సీనియర్ నేత ఆజాద్ వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గాంధీ కుటుంబం నుంచి అధ్యక్షుడిగా ఉండాలని కొంతమంది, గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడిగా ఉండాలని మరికొంతమంది డిమాండ్ చేస్తున్నారు. నాటకీయ పరిణామాలు, గందరగోళ పరిస్థితుల మధ్య అధ్యక్షురాలిగా కొనసాగేందుకు సోనియా ఒప్పుకున్నారు. ఆరు నెలల పాటు అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. ఆలోగా పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సీడబ్ల్యూసీ వెల్లడించింది.