×
Ad

ఛలో గావ్.. కాంగ్రెస్ ఊరిబాట.. దేశవ్యాప్త నిరసనలకు పిలుపు..

"రాజ్యాంగంపై విశ్వాసంతో ప్రజాస్వామ్య రక్షణకు కట్టుబడుతున్నాం. ప్రతి గ్రామంలో మా గళం వినిపిస్తాం" అని ఖర్గే అన్నారు.

CWC

CWC meet: ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. ఇందులో కీలక అంశాలపై చర్చలు జరిపారు. తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌), శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదించిన జీ రామ్ జీ బిల్లు, బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అశాంతి వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తీసేశారంటూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది.

Video: పూర్తిగా మారిపోతున్న బంగ్లాదేశ్.. రాక్‌స్టార్ కాన్సెర్ట్‌ నిర్వహించొద్దంటూ మూకదాడి, 25 మందికి గాయాలు.. ఇకపై..

ఈ సీడబ్ల్యూసీ సమావేశానికి మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శశిథరూర్, తదితర నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయ కమిటీనే సీడబ్ల్యూసీ. ఈ సమావేశం అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ రద్దుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని చెప్పారు. దీన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ చట్టాన్ని ఏకపక్ష నిర్ణయంగా ఖర్గే విమర్శించారు. రాష్ట్రాలతో సంప్రదింపులు లేకుండా ప్రభుత్వం ముందుకెళ్లిందని చెప్పారు. ఈ చట్టం వల్ల రాష్ట్రాలపై అదనపు వ్యయ భారం పడుతుందని తెలిపారు. “జనవరి 5 నుంచి ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ బచావో ఆందోళన్ ప్రారంభించాలని సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం చేశాం” అని ఖర్గే తెలిపారు.

“మహాత్మా గాంధీ పేరును ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ నుంచి తొలగించే ప్రతి కుట్రకు ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యతిరేకత ప్రకటిస్తామని ప్రమాణం చేశాం. కార్మికులకు సహజంగానే ఉండే హక్కులను దానధర్మంగా ఇస్తున్నామన్నట్లు రూపొందిస్తున్న విధానాలను అడ్డుకుంటాం.

రాజ్యాంగంపై విశ్వాసంతో ప్రజాస్వామ్య రక్షణకు కట్టుబడుతున్నాం. ప్రతి గ్రామంలో మా గళం వినిపిస్తాం. ‘జై సంవిధాన్’, ‘జై హింద్’ నినాదాలతో ఈ సంకల్పాన్ని మేమందరం స్వీకరించాం” అని ఖర్గే చెప్పారు.

యూపీఏ కాలంలో అమలులోకి వచ్చిన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏని రద్దు చేసిన కేంద్ర సర్కారు ఆ స్థానంలో వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తీసుకొచ్చింది. కాగా, బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక భావాలను కొందరు రెచ్చగొడుతున్న విషయం తెలిసిందే. దీనిపై కూడా కాంగ్రెస్‌ పార్టీ చర్చించడం గమనార్హం.

మోదీ సొంతంగా నిర్ణయం తీసుకున్నారు: రాహుల్
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏను రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది దేశంలోని పేద ప్రజలపై జరిగిన దాడి అని అభివర్ణించారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ ఓ స్కీమ్ మాత్రమే కాదని, దేశంలోని పేదల పని హక్కు అని చెప్పారు. కేంద్ర సర్కారు తీరుపై పోరాడడానికి ముందుకు రావాలని ప్రతిపక్ష నేతలకు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.