Video: పూర్తిగా మారిపోతున్న బంగ్లాదేశ్.. రాక్‌స్టార్ కాన్సెర్ట్‌ నిర్వహించొద్దంటూ మూకదాడి, 25 మందికి గాయాలు.. ఇకపై..

బంగ్లాదేశ్‌లో ఆయనకు విపరీతమైన ప్రజాదరణ ఉంది. అటువంటి రాక్‌స్టార్‌ కచేరీపై దాడి జరగడం అంటే బంగ్లాదేశ్‌లో తీవ్రవాద శక్తులు ఎంతగా పేట్రేగిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

Video: పూర్తిగా మారిపోతున్న బంగ్లాదేశ్.. రాక్‌స్టార్ కాన్సెర్ట్‌ నిర్వహించొద్దంటూ మూకదాడి, 25 మందికి గాయాలు.. ఇకపై..

Updated On : December 27, 2025 / 3:53 PM IST

Video: బంగ్లాదేశ్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. మళ్లీ అతి ఛాందసవాద కాలానికి దిగజారిపోతున్నాయి అక్కడి తీవ్రవాద శక్తులు. కళాకారులు, సాంస్కృతిక సంస్థలపై దాడులు జరుగుతున్నాయి. ప్రజాదరణ పొందిన గాయకుడు జేమ్స్ (రాక్‌స్టార్‌) ఫరీద్‌పూర్‌లో కాన్సెర్ట్‌ నిర్వహించాల్సి ఉండగా, సరిగ్గా అదే సమయానికి వచ్చిన ఓ మూక.. అక్కడి ప్రేక్షకులపై ఇటుకలు, రాళ్లు విసిరింది.

ఈ ఘటనలో 25 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఆందోళనకారులను విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, చివరకు స్థానిక అధికారుల ఆదేశాల మేరకు కాన్సెర్ట్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. స్థానిక కథనాల ప్రకారం.. ఒక స్థానిక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి 9 గంటలకు కచేరీ జరగాల్సి ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఢాకా నుంచి ఫరీద్‌పూర్‌ సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

రచయిత తస్లీమా నస్రీన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. బంగ్లాదేశ్‌లో కనిపిస్తున్న ధోరణిని తీవ్రంగా విమర్శించారు. సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ఆమె ట్వీట్ చేశారు. “ఛాయానాట్ (బంగ్లాదేశ్‌లోని ప్రముఖ సాంస్కృతిక సంస్థ) సాంస్కృతిక కేంద్రం పూర్తిగా దగ్ధమైంది. సంగీతం, నాటకం, నృత్యం, పఠనం, జానపద సంస్కృతి ప్రోత్సాహం ద్వారా లౌకిక, ప్రగతిశీల చైతన్యం పెంపొందించేందుకు స్థాపితమైన సంస్థ కూడా పూర్తిగా కాలిపోయింది.

జిహాదిస్టులు ప్రసిద్ధ గాయకుడు జేమ్స్ కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతించలేదు. కొన్ని రోజుల క్రితం సిరాజ్ అలీ ఖాన్ ఢాకాకు వచ్చారు. ఆయన అలీ అక్బర్ ఖాన్ మనవడు. ప్రపంచ ప్రసిద్ధ గురువు ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ కుమారుడైన అలీ అక్బర్ ఖాన్ వారసత్వానికి చెందినవారు.

సిరాజ్ అలీ ఖాన్ స్వయంగా మైహర్ ఘరానాకు చెందిన ప్రతిష్ఠాత్మక కళాకారుడు. కళాకారులు, సంగీతం, సాంస్కృతిక సంస్థలు సురక్షితంగా ఉండే వరకు బంగ్లాదేశ్‌కు రానని చెబుతూ ఢాకాలో ఏ కార్యక్రమం నిర్వహించకుండా భారత్‌కు తిరిగివెళ్లారు. రెండు రోజుల క్రితం ఉస్తాద్ రషీద్ ఖాన్ కుమారుడు అర్మాన్ ఖాన్ కూడా బంగ్లాదేశ్‌ ఆహ్వానాన్ని తిరస్కరించారు. సంగీతాన్ని ద్వేషించే జిహాదిస్టులు నివసించే బంగ్లాదేశ్‌లో అడుగు పెట్టదలచుకోలేదని ఆయన స్పష్టం చేశారు” అని నస్రీన్ పేర్కొన్నారు.

రెండు రోజుల క్రితం ఉస్తాద్ రషీద్ ఖాన్ కుమారుడు అర్మాన్ ఖాన్ కూడా బంగ్లాదేశ్‌ ఆహ్వానాన్ని తిరస్కరించారు. సంగీతాన్ని ద్వేషించే జిహాదిస్టులు నివసించే బంగ్లాదేశ్‌లో అడుగు పెట్టదలచుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

కాగా, జేమ్స్ బంగ్లాదేశీ గాయకుడు, గీత రచయిత, గిటారిస్ట్, స్వరకర్త. నగర్ బౌల్ రాక్ టీమ్‌లో ఆయన పనిచేస్తుంటారు. గ్యాంగ్‌స్టర్ సినిమాలో భీగీ భీగీ, లైఫ్ ఇన్ ఎ మెట్రో సినిమాలో ఆల్విదా వంటి హిందీ పాటలు ఆయన పాడారు. బంగ్లాదేశ్‌లో ఆయనకు విపరీతమైన ప్రజాదరణ ఉంది. అటువంటి రాక్‌స్టార్‌ కచేరీపై దాడి జరగడం అంటే బంగ్లాదేశ్‌లో తీవ్రవాద శక్తులు ఎంతగా పేట్రేగిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.