Parliament: ‘అదానీ’ వ్యవహారంపై తగ్గేది లేదు.. లోక్‌స‌భ‌లో మళ్లీ గందరగోళం.. రాజ్యసభ రేపటికి వాయిదా

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం కూడా విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య ప్రారంభమయ్యాయి. అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదైన వ్యవహారంపై చర్చ జరపాలని ..

INDIA alliance

Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం కూడా విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య ప్రారంభమయ్యాయి. భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదైన వ్యవహారంపై చర్చ జరపాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఈ అంశంపై చర్చజరపాలని పట్టుబట్టాయి. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు. రాజ్యసభలోనూ అదానీ విషయంపై చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. విపక్ష సభ్యులు నిరసనకు దిగడంతో సభలో కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. ఉదయం 11.30గంటలకు సభ తిరిగి ప్రారంభం అయినప్పటికీ సభలో విపక్ష సభ్యుల నిరసనల మధ్య గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయినా, ఎంపీల నినాదాల మధ్యలో చైర్మన్ కొద్దిసేపు ప్రశ్నోత్తరాలను నిర్వహించినప్పటికీ తరువాత సభను గురువారానికి వాయిదా వేశారు.

Also Read: Pawan Kalyan: కలిసి పోరాడదాం.. బంగ్లాదేశ్‌లో చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుపై స్పందించిన పవన్ కల్యాణ్

అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని ఇండియా కూటమి ఎంపీలు ఆందోళనకు దిగారు. ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో అత్యంత ముఖ్యమైన వక్ఫ్ సవరణ బిల్లును జాబితాలో చేర్చారు. జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును మాత్రం పక్కన బెట్టారు.

Also Read: బీఆర్ఎస్‌కు మళ్లీ వలసల టెన్షన్ మొదలైందా? కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఆరా?

సభ వాయిదా అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. అదానీ జైలులో ఉండాలి.. మోదీ ప్రభుత్వమే రక్షిస్తోందని అన్నారు. అదానీని అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్న చిన్న ఆరోపణలపై ఎంతో మందిని అరెస్టు చేస్తున్నారు.. వేల కోట్ల కుంభకోణం వ్యవహారంలో అదానీని జైలులో పెట్టాలని, కానీ, ఆయన్ను మోదీ ప్రభుత్వం రక్షిస్తోందంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు.
అంతకు ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్ లో ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించారు.