కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ అరెస్ట్

కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,మాజీ మంత్రి డీకే శివకుమార్ ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(PMLA)కింద ఆయనను అరెస్ట్ చేశారు. 8.83 కోట్ల మనీలాండరింగ్ కేసులో సంబంధం ఉందని ఆయనపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఆయన విచారణ కోసం ఈడీ కార్యాలయానికి వెళ్లి వస్తున్నారు.
ఈ క్రమంలో ఇవాళ(సెప్టెంబర్-3,2019)విచారణకు సహకరించడం లేదంటూ ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. శర్మ ట్రావెల్స్ యజమాని సునీల్ కుమార్ శర్మతో,కాఫీ డేతో తనకున్న వ్యాపార లావాదేవీలు, సంబంధాల గురించి కూడా శివకుమార్ ని ఈడీ అధికారులు విచారించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.
శివకుమార్ పై పన్ను ఎగవేత ఆరోపణలున్నాయి. ఆగస్టు 2017 లో న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లోని శివకుమార్ నివాసంతో సహా ఆయనకు సంబంధించిన ఆఫీసులు,పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపిన సమయంలో రూ .8.83 కోట్ల నగదు దొరకడంతో శివకుమార్ పై ఐటీ కేసు నమోదైంది. 2018 లో ఆర్థిక నేరాల కోర్టులో శివకుమార్ పై ఆదాయపు పన్ను శాఖ చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత మనీలాండరింగ్ నిరోధక చట్టం, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 120 బి కింద డికె శివకుమార్,అతని వ్యాపార సహచరులపై ఈడీ కేసు నమోదు చేసింది.