పార్టీలో,ప్రభుత్వంలో పదవులపై సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు

రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడిన నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో పదవులపై చర్చ సాగుతోంది. పార్టీలో లేదా ప్రభుత్వంలో ఎవరు ఎక్కడ పని చేయాలనేది కాంగ్రెస్ అగ్ర నాయకత్వం నిర్ణయిస్తుందని మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ అన్నారు.
అన్ని సమస్యలకు ఏఐసీసీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ పరిష్కారం కనుగొంటుందనే నమ్మకం ఉందన్నారు. కమిటీ ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టినందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలికి నా కృతజ్ఞతలు. కమిటీ తనపని తాను పూర్తి చేస్తుంది. వారు రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం చర్యలు ఉంటాయి. ఏ పనైనా.. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయంతో జరగాలి. ప్రభుత్వంలో, పార్టీలో ఎవరు పని చేయాలనే తుది నిర్ణయాన్ని అధిష్ఠానం తీసుకుంటుంది. అన్ని సమస్యలను కమిటీతో చర్చిస్తాం అని పైలట్ అన్నారు.
మరోవైపు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాజస్థాన్ వ్యవహారాల ఇంఛార్జిగా కొత్తగా నియమితులైన అజయ్ మాకెన్తో సోమవారం భేటీ అయ్యారు పైలట్. ఈ సందర్భంగా రెబల్ ఎమ్మెల్యేల సమస్యలపై చర్చించినట్లు తెలుస్తోంది.