హీరోల్లా ఐసీయూలోకి నడుచుకుంటూ వెళ్లి.. రోగిపై కాల్పులు జరిపి, చంపి.. పరుగులు తీసిన గూండాలు.. వీడియో షేర్ చేసిన కాంగ్రెస్‌

పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం వేట ప్రారంభించారు. చందన్‌పై అనేక హత్య కేసులు ఉన్నాయని, ఈ కాల్పులను ప్రత్యర్థి గ్యాంగ్ చేసి ఉండవచ్చని ఎస్ఎస్పీ కార్తికేయ శర్మ తెలిపారు.

హీరోల్లా ఐసీయూలోకి నడుచుకుంటూ వెళ్లి.. రోగిపై కాల్పులు జరిపి, చంపి.. పరుగులు తీసిన గూండాలు.. వీడియో షేర్ చేసిన కాంగ్రెస్‌

Updated On : July 17, 2025 / 7:03 PM IST

బిహార్ రాజధాని పాట్నాలోని పారస్ ఆసుపత్రిలో జరిగిన ఓ దారుణ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. సీఎం నీతీశ్ కుమార్ ప్రభుత్వ పాలనలో బిహార్‌లో గుండాలు రెచ్చిపోతున్నారని విమర్శించింది.

ఈ వీడియో ప్రకారం.. నలుగురు వ్యక్తులు ఆసుపత్రి కారిడార్‌లో నడుస్తూ ఒక గది తలుపు తెరిచి, రోగిపై కాల్పులు జరిపి, ఎటువంటి అడ్డంకి లేకుండా పారిపోయారు.

బాధితుడు చందన్ మిశ్రా బిహార్ జైలులో హత్యా నేరంతో శిక్ష అనుభవిస్తూ, వైద్య పెరోల్‌పై ఆసుపత్రిలో ఉన్నాడు. అతడినే ఐసీయూలో దుండగులు కాల్చి చంపారు. “మృతుడు చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. అతడు పెరోల్‌పై ఉన్నాడు” అని పాట్నా సెంట్రల్ ఎస్పీ దీక్షా ధ్రువీకరించారు. పాత శత్రుత్వమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది.

Also Read: టాటా పంచ్ సంచలనం.. ఈ కారును అందరూ ఇంతగా ఎందుకు కొంటున్నారు? 6 లక్షల అమ్మకాలతో చరిత్ర.. తక్కువ ధర

కాంగ్రెస్ వీడియోను షేర్ చేస్తూ.. బిహార్‌లో ‘గుండా పాలన’ కొనసాగుతోందని, గత 17 రోజుల్లో 46 హత్యలు జరిగాయని తెలిపింది. ఇప్పుడు రాజధాని పాట్నాలోని పారస్ ఆసుపత్రిలో ఆయుధాలతో ప్రవేశించి, కాల్పులు జరిపి హత్య చేశారని విమర్శించింది.

పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం వేట ప్రారంభించారు. చందన్‌పై అనేక హత్య కేసులు ఉన్నాయని, ఈ కాల్పులను ప్రత్యర్థి గ్యాంగ్ చేసి ఉండవచ్చని పాట్నా ఎస్ఎస్పీ కార్తికేయ శర్మ తెలిపారు.

ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ దీనిపై స్పందిస్తూ.. “బిహార్‌లో ఎవరైనా సురక్షితంగా ఉన్నారా? 2005కు ముందు, ఆర్జేడీ పాలనలో ఇటువంటి ఘటన జరిగిందా?” అని ప్రశ్నించారు.

“బిహార్‌లో ‘గుండా రాజ్’ నడుస్తోంది. నేరస్థులకు భయం లేదు… ఎవరూ సురక్షితంగా లేరు” అని ఆర్జేడీ నాయకుడు మృత్యుంజయ్ తివారీ అన్నారు.