CBSE  పరీక్షా ఫలితాలకు ఫోర్ పాయింట్ ఫార్ములా

  • Published By: murthy ,Published On : June 28, 2020 / 02:16 PM IST
CBSE  పరీక్షా ఫలితాలకు ఫోర్ పాయింట్ ఫార్ములా

Updated On : June 28, 2020 / 2:16 PM IST

పది, 12వ తరగతుల పరీక్షల ఫలితాల ప్రకటనకు ఫోర్‌ పాయింట్‌ ఫార్ములాను రూపొందించినట్టు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) తెలిపింది. ఫిబ్రవరిలో ప్రారంభమైన పరీక్షలు లాక్‌డౌన్‌ కారణంగా మధ్యలోనే నిలిచిపోవటంతో మిగిలిన పరీక్షలు నిర్వహించకుండానే ఫలితాలను వెల్లడిస్తామని సుప్రీం కోర్టుకు శుక్రవారం నివేదించింది. సీబీఎస్‌ఈ ప్రతిపాదనకు కోర్టు అనుమతి తెలిపింది. పరీక్షల ఫలితాలను జూలై 15 నాటికి ప్రకటించనున్నారు.

నాలుగు అంశాల ఫార్ములా
1. పరీక్షలు మొత్తం రాసిన విద్యార్థులకు ఆ పరీక్షల్లో వచ్చిన మార్కులే తుది ఫలితాలు.
2. మూడు సబ్జెక్టుల కంటే ఎక్కువ పరీక్షలు రాసిన విద్యార్థులకు.. వాటిల్లో అత్యధిక మార్కులు వచ్చిన మూడు సబ్జెక్టుల మార్కులను సగటుగా తీసుకొని రాయని ఇతర సబ్జెక్టులకు మార్కులు వేస్తారు.
3. మూడు సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు రాసిన విద్యార్థులకు అందులోని అత్యుత్తమ మార్కులు సాధించిన ఏవైనా రెండు సబ్జెక్టుల మార్కులను సగటుగా తీసుకొని పరీక్షలు రాయని ఇతర సబ్జెక్టులకు మార్కులు వేస్తారు.
4. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్ల కారణంగా ఆ ప్రాంత విద్యార్థులు కొందరు పరీక్షలు రాయలేకపోయారు. వారికి ఇంటర్నల్‌ ఎగ్జామ్స్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా మార్కులు వేస్తారు.
-పరిస్థితులు అనుకూలిస్తే 12వ తరగతికి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. ఫోర్‌ పాయింట్‌ ఫార్ములా ద్వారా సరైన మార్కులు రాలేదని భావించే విద్యార్థులు ఈ పరీక్షలు రాయొచ్చు. పదో తరగతికి ఈ అవకాశం లేదు. కాగా, ఫలితాల వెల్లడిలో సీబీఎస్‌ఈ విధానాన్నే తామూ  పాటిస్తామని ఐసీఎస్‌ఈ తెలిపింది.

Read: జూలై 31 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌