Sahasra Case : సహస్ర హత్యకి మొదట అడుగు పడింది ఆ రోజే.. బయటపెట్టిన పోలీసులు
కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) మిస్టరీ వీడింది. హత్య జరిగిన తీరును పోలీసులు మీడియాకు వివరించారు.

Sahasra Case
Sahasra Case : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) మిస్టరీ వీడింది. ఈ కేసుకు సంబంధించి సీపీ అవినాష్ మహంతి వివరాలను వెల్లడించారు. క్రికెట్ బ్యాట్ కోసమే ఇదంతా జరిగినట్టు తేలిందని అన్నారు. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు ఉన్నాయని, దొంగతనం కోసం నెల రోజుల ముందే బాలుడు ప్లాన్ చేసినట్లు, బాలిక హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
సహస్ర కుటుంబంతో బాలుడు, అతని కుటుంబ సభ్యులు కలివిడిగానే ఉండేవారు. గతేడాది సహస్ర బర్త్ డే వేడుకలకు తన కుటుంబ సభ్యులతో కలిసి బాలుడు వెళ్లాడు. సహస్ర తమ్ముడితోనూ నిందితుడు స్నేహంగానే ఉండేవాడు. ఈ క్రమంలో అతడితో కలిసి పలుసార్లు క్రికెట్ కూడా ఆడాడు. సహస్ర తమ్ముడి దగ్గర ఎంఆర్ఎఫ్ క్రికెట్ బ్యాట్ ఉంది. అది తనకు కూడా కావాలని తరచూ అడిగేవాడు. ఒక్కోసారి ఇవ్వకపోవడంతో అతను కోపంతో వెళ్లిపోయేవాడు. అయితే, ఓ రోజు బ్యాట్‌తో ఆడతా అని అడిగితే సహస్ర తమ్ముడు ఇవ్వలేదు. ఆ బ్యాట్ మంచి స్ట్రోక్ ఉండటం వల్ల ఆ బ్యాట్ దొంగతనం చేయాలని బాలుడు భావించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సహస్ర తమ్ముడి వద్ద ఉన్న బ్యాట్‌ను దొంగిలించేందుకు నెల రోజుల నుంచి అతను ప్లాన్ చేశాడు. ఆరేళ్ల నుంచి ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూసే అలవాటు. సస్పెన్స్, మిస్టరీ సినిమాలు, వీడియోలు విపరీతంగా చూసేవాడు. స్కూల్‌కు కూడా వెళ్లేవాడు కాదు. బడి ఎగ్గొట్టి ఎక్కువగా ఓటీటీలు చూసేవాడు. దొంగతనం ఎలా చేయాలో బాలుడు ముందుగానే స్లిప్‌లో రాసుకున్నాడు. చివరిలో మిషన్ డన్ అని కూడా స్లిప్‌లో రాసుకున్నాడు. నెల రోజులు నుంచి ప్లాన్ చేసుకున్న విధంగా.. బ్యాట్ దొంగతనం కోసం సహస్ర ఇంటికి వెళ్లాడు. ప్రతిసారి సహస్ర వాళ్ల డోర్ దగ్గరికి వేసి ఉంటుంది.. ఈ విషయాన్ని గమనించాడు.
కిచెన్ లో ఉన్న బ్యాట్ తీసుకుని వెళ్తుంటే సహస్ర గుర్తించి చొక్కా పట్టుకుంది. ఆపై బాలికను తోసేసి కళ్లుమూసి విచక్షణ రహితంగా కత్తితో పొడిచాడు. సహస్ర హత్య తరువాత బాలుడు తల్లి అనుమానంతో నువ్వు హత్య చేశావా..? అని అడిగింది. బాలుడు లేదు అని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో నువ్వే నన్ను పట్టించేలా ఉన్నావ్ అని తల్లిపై తిరగబడ్డాడు. బాలుడుపై ముందే అనుమానం వచ్చింది. ఆర్డర్ ప్రకారం విచారిస్తూ వచ్చే సరికి ఆలస్యం అయింది. వేరే వారు కూడా గోడ వద్ద బాలుడు తచ్చాడుతూ ఉన్న విషయాన్ని చూసి మాకు చెప్పారని పోలీసులు పేర్కొన్నారు.
మర్డర్ తరువాత బాలుడు షర్ట్ కు రక్తం మరకలు అంటుకున్నాయి. అనంతరం ఆరేసిన షర్టును అడ్డుపెట్టుకొని ఇంట్లోకి వెళ్లి స్నానం చేశాడు. రెండు నెలల క్రితం అతనికి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎలా వచ్చిందని వాళ్ల అమ్మ అడిగింది. వాస్తవానికి అబ్బాయి కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగాలేదు. వాళ్ల అమ్మ కూడా ఫోన్ కోసం డబ్బులు ఇవ్వలేదు. దాన్ని బట్టి ఇతర క్రైమ్ లు ఇంకేమైనా చేశాడా అనే విషయంపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.