కరోనా పేషంట్లకు సేవ చేస్తూ విధుల్లో బిజీగా ఉన్న బెంగుళూరు డాక్టర్లు పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ప్రసవం చేయకుండా పంపించేశారు. గత్యంతరం లేని పరిస్ధితుల్లోతన ముగ్గురు కూతుళ్ల సహాయంతో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది ఆ ఇల్లాలు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమెను క్షేమంగా మరోక ఆస్పత్రికి తరలించి.. వారి బాగోగులు చూశారు. అనంతరం వారిని ఒక ఆశ్రమానికి తరలించారు. ఈ ఘటన బెంగుళూరులో జరిగింది.
రాయచూరు కు చెందిన లక్ష్మి కుటుంబం ఉపాధి కోసం కొన్నేళ్ల కిందట బెంగుళూరు కు వలస వచ్చింది. వారికి ముగ్గురు కుమార్తెలు, వారి వయస్సు వరుసగా 12,9,7 సంవత్సరాలు. వీరి కుటుంబం బ్యాడర హళ్లిలో నివాసం ఉండేది. ముగ్గురు పిల్లల తర్వాత లక్ష్మి మరోసారి గర్భం ధరించే సరికి భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె భవన నిర్మాణ పనులకు వెళుతూ పిల్లల్ని పోషించుకుంటోంది.
ఈ క్రమంలో ఆమెకు 9 నెలలు నిండటంతో బుధవారం మార్చి25న పురిటి నొప్పులు అధికమయ్యాయి. దీంతో కుమార్తెలు ఆమెను బెంగళూరులోని కెంగేరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అక్కడ కరోనా వైరస్ లక్షణాలతో ఉన్నవారు చికిత్స పొందుతున్నందున ప్రసవం చేయలేమని, వేరే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు చెప్పారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె కుమార్తెలతో కలసి తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. గురువారం నొప్పులు అధికం కావడంతో తల్లి ఇచ్చిన సూచనలతో ముగ్గురు కుమార్తెలు ప్రసవం చేశారు.
మగబిడ్డ జన్మించడంతో వారి కుటుంబంలో ఆనందం మిన్నంటింది. విషయం తెలుసుకున్న స్థానికులు వెళ్లి….బాలింతకు, పిల్లలకు సహకారం అందజేశారు. అనంతరం విషయాన్ని బ్యాడరహళ్లి పోలీసులకు చెప్పారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని తల్లి, ముగ్గురు కుమార్తెలు, నవజాత శిశువును ఆస్పత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో సేవలు అందించారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో ప్రస్తుతం వారిని ఉల్లాళ ఆశ్రమానికి తరలించారు. అనంతరం ఆమె కుటుంబానికి పోలీసులు కొంత నగదు సాయాన్ని అందజేశారు.