కఠిన చర్యలు తీసుకునే పరిస్థితికి తీసుకురావద్దు: కేంద్రానికి సుప్రీంకోర్టు వార్నింగ్

Corona Virus Supreme Court Hear Petition On Oxygen Supply In Delhi
ఆక్సిజన్ సరఫరా అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది. కఠినమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి మమ్మల్ని తీసుకుని రావద్దని సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది.
ఆక్సిజన్ సమస్యపై కోర్టు ఆదేశించినా కూడా, కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను మాకు సరఫరా చేయలేకపోయింది అంటూ ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకెక్కగా.. ఈ మేరకు కేంద్రాన్ని మందలించింది కోర్టు. “ప్రతిరోజూ ఢిల్లీకి 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం అందించాల్సిందే” అని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ప్రతిరోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మాకు తగినంత ఆక్సిజన్ సరఫరా వస్తే, ఢిల్లీలో 9,000 నుండి 9,500 పడకలను ఏర్పాటు చేయగలుగుతామని కోర్టుకు చెప్పగా.. ఈ మేరకు కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.
ఢిల్లీలో ఊహించని విధంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయని, ఈ సమస్యను ఎదుర్కోవడానికి తాము తదుపరి ఆదేశాలను ఇచ్చేంత వరకు ఆక్సిజన్ సరఫరాను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రతి రాష్ట్రానికి సరఫరా అవుతున్న ఆక్సిజన్ పై ఎక్స్ పర్ట్ ప్యానల్ ఆడిట్ నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఎంతో మంది జీవితాలను కాపాడటమే తమ ప్రధాన కర్తవ్యమని పేర్కొంది.