కౌంటింగ్ స్టార్ట్…పార్టీ ఆఫీసుల్లో స్వీట్లు రెడీ

హర్యానా, మహారాష్ట్ర రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటుగా 8 రాష్ట్రాలలోని 51 అసెంబ్లీ స్థానాలకు,రెండు లోక్ సభ స్థానాలకు కూడా జరిగిన ఉప ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు జరిగాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్ ల స్లిప్పులను కూడా లెక్కించనున్నారు. వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు చివరగా జరగనుంది.

హర్యానా,మహారాష్ట్ర అసెంబ్లీలో మరోసారి బీజేపీనే పాగా వేస్తుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. హర్యానాలో బీజేపీ-శివసేన కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ గెలిస్తే సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ కొనసాగుతాడని,హర్యానాలో బీజేపీ గెలిస్తే మనోహర్ లాల్ ఖట్టర్ మరోసారి సీఎంగా కొనసాగుతారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే.

ముంబైలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో అప్పుడే మిఠాయిలు సిద్దం చేశారు. అక్కడున్న బీజేపీ ప్రతినిధులు మాట్లాడుతూ… ఓట్ల లెక్కింపులో బీజేపీ బంపర్‌ మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. అందుకే ఈ ఏర్పాట్లు ముందుగానే చేస్తున్నామని వారు తెలిపారు.