మోడీకి మమత కౌంటర్…నా చీర చూసి క్యారెక్టర్ చెబుతారా

వేసుకున్న దుస్తుల ద్వారా హింసాత్మ‌క ఆందోళ‌న‌లు చేప‌డుతున్న వారిని గుర్తుప‌ట్ట‌వ‌చ్చంటూ జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఇటీవల ప్ర‌ధాని మోడీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే మోడీ వ్యాఖ్యలపై వెస్ట్ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఇవాళ(డిసెంబర్-17,2019)స్పందించారు.

ఇవాళ‌ రెండ‌వ రోజు కోల్‌క‌తాలో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ…పౌరసత్వ చట్టానికి వ్య‌తిరేకంగా ధ‌ర్నా చేప‌ట్టారు .సినీ తార‌లు, తృణ‌మూల్ ఎంపీలు ఆ ర్యాలీలో పాల్గొన్నారు. స‌మావేశానికి వ‌చ్చిన భారీ జ‌న‌స‌మూహాన్ని ప్ర‌శ్నిస్తూ… దుస్తుల ఆధారంగా ఎవ‌రినైనా గుర్తుప‌ట్ట‌డం వీల‌వుతుందా. కేవ‌లం డ్రెస్ కోడ్ ఆధారంగా ఒక‌ర్ని మంచిగా, మ‌రొక‌ర్ని చెడుగా చూడ‌లేమ‌న్నారు. నేను క‌ట్టుకున్న‌ చీరు చూసి, నేను మంచో చెడో అన్న కామెంట్‌ను ఎవ‌రైనా చేయ‌గ‌ల‌రా అని మమత ప్ర‌శ్నించారు.  

ఎవ‌రైనా నెత్తికి టోపీ పెట్టుకుంటే వారిని ఆ టోపీ ద్వారానే గుర్తిస్తారా అని అడిగారు. ఇది వీళ్ల డ్రెస్సు, అది వాళ్ల డ్రెస్సు, ఇది వీళ్ల తిండి, అది వాళ్ల‌ది.. ఇలాంటివి ఎప్పుడు మ‌న దేశంలోకి చొర‌బ‌డ్డాయ‌ని ఆమె నిల‌దీశారు.  మీరు వేసుకున్న శాలువా కూడా కాషాయం రంగులో ఉండాల‌ని ఎవ‌రైనా అడిగినా అడ‌గ‌వ‌చ్చు అని, ఇదేనా మ‌న‌కు కావాల్సింద‌ని మమత అన్నారు