మాల్యా ఆస్తులు అమ్ముకోండి…బ్యాంకులకు కోర్టు అనుమతి

  • Published By: venkaiahnaidu ,Published On : January 1, 2020 / 01:54 PM IST
మాల్యా ఆస్తులు అమ్ముకోండి…బ్యాంకులకు కోర్టు అనుమతి

Updated On : January 1, 2020 / 1:54 PM IST

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ముంబై కోర్టు భారీ షాక్ ఇచ్చింది. మాల్యా ఆస్తులను విక్రయించడానికి ఎస్ బీఐ నేతృత్వంలోని 15 బ్యాంకుల కన్సార్టియంకు ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. మాల్యాకు రుణాలను ఇచ్చి నష్టపోయిన బ్యాంకులు, జప్తులో ఉన్న ఆయన ఆస్తులను అమ్మి తమ సొమ్మును రాబట్టుకోవటానికి కోర్టు అనుమతించినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్‌కు సంబంధించిన నేరాలను విచారించే ముంబైలోని ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ న్యాయస్థానం ఈ విధంగా ఆదేశించింది. 

అయితే ఈ కేసుకు సంబంధించి సంబంధిత పార్టీలు కోర్టు ఆదేశాలపై  బాంబే హైకోర్టులో అప్పీలు చేసుకొనేందుకు వీలుగా తమ తీర్పును జనవరి 18 వరకు వాయిదా వేసినట్టు కూడా న్యాయస్థానం తెలియచేసింది. జప్తు చేసిన ఆస్తులు ముఖ్యంగా షేర్ల వంటి సెక్యూరిటీల రూపంలో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. 2016లో పీఎమ్ఎల్ఏ జప్తు చేసిన యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్(UBHL)షేర్ల వంటివి ఇందులో ఉన్నాయి. 

కొత్త ఫుజిటివ్‌ ఎకనమిక్‌ అఫెండర్స్‌  చట్ట ప్రకారం గత ఏడాది మాల్యాను ఆర్థిక నేరస్తుడిగా  పీఎంఎల్‌ఏ కోర్టు నిర్థారించి, ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవలసిందిగా ఆదేశించింది. బ్యాంకులు తమకు రావలసిన 6వేల 230 కోట్ల 35లక్షల రూపాయలను 2013 నుంచి 11.5 శాతం వడ్డీతో సహా రాబట్టేందుకు విజయ్‌ మాల్యా అస్తుల విక్రయానికి అనుమతించాల్సిందిగా కోరుతున్నాయి. కాగా జప్తు చేసిన మాల్యా ఆస్తులను ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం విక్రయించుకోవటానికి తమకేమీ అభ్యంతరం లేదని ఈడీ గత ఏడాది  ఫిబ్రవరిలో కోర్టుకి తెలిపింది. బ్యాంకుల అభ్యర్ధనలను పరిగణించిన కోర్టు ప్రస్తుత తీర్పును వెలువరించింది. 

మనీ లాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌ మాల్యా 2016 మార్చిలో లండన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. 2017లో అరెస్ట్‌  మాల్యా ప్రస్తుతం బెయిల్‌మీద ఉన్నాడు. మాల్యాను భారత్‌కు రప్పించేందుకు భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.