Bharat Biotech : బ్రెజిల్ డీల్ వివాదంపై భారత్ బయోటెక్ వివరణ
కోవాగ్జిన్ బ్రెజిల్ డీల్ వివాదంపై భారత్ బయోటెక్ సంస్థ స్పందించింది.

Bharat Biotech (1)
Bharat Biotech కోవాగ్జిన్ బ్రెజిల్ డీల్ వివాదంపై భారత్ బయోటెక్ సంస్థ స్పందించింది. బ్రెజిల్ తో డీల్ విషయంలో తాము ఏ తప్పూ చేయలేదని..ఒప్పందం నుంచి రెగ్యులేటరీ అనుమతుల దాకా అన్ని నియమాలనూ పాటించినట్లు భారత్ బయోటెక్ ఇవాళ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్ మినహా విదేశాలకు సరఫరా చేసే వ్యాక్సిన్లపై ఒక్క డోసుకు 15 నుంచి 20 డాలర్లుగా ఇదివరకే నిర్ధారించామని…ఇందులో భాగంగానే బ్రెజిల్ కు కూడా డోసుకు 15 డాలర్ల చొప్పున అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది.
నవంబర్-2020 లో డీల్ పై బ్రెజిల్ తో చర్చలు జరిపినప్పటి నుంచి ఇప్పటిదాకా 8 నెలల కాలంలో ప్రతి నియమాన్ని పాటించాం. జూన్-4,2021న కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి బ్రెజిల్ ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే, బ్రెజిల్ నుంచి కోవాగ్జిన్ టీకాల కోసం ఎటువంటి అడ్వాన్స్ పేమెంట్ తీసుకోలేదు..ఆదేశానికి కోవిడ్ టీకాలను కూడా సరఫరా చేయలేదు. వివిధ దేశాలతో చేసుకున్న మరియు చేసుకుంటున్న ఒప్పందాల్లోనూ అన్ని నియమాలను అనుసరిస్తున్నట్లు భారత్ బయోటెక్ తన ప్రకటనలో పేర్కొంది. తాము నిర్ణయించిన ధరతోనే చాలా దేశాలతో ఒప్పందాలు అయ్యాయని.. దానికి సంబంధించిన అడ్వాన్స్ చెల్లింపులూ జరిగినట్లు తెలిపింది. బ్రెజిల్ విషయంలో ప్రెసిసా మెడికమెంటోస్ సంస్థతో జత కలిశామని, ఇప్పటికే రెగ్యులేటరీ అనుమతులకు దరఖాస్తు చేశామని, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కూ దరఖాస్తు చేసుకున్నామని పేర్కొంది.
కాగా, 2 కోట్ల డోసుల కోవాగ్జిన్ టీకాలను కొనుగోలు చేసేందుకు ఫిబ్రవరిలో బ్రెజిల్ ఆరోగ్యశాఖ భారత్ బయోటెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ.2,234 కోట్లు. బ్రెజిల్ లో కోవాగ్జిన్ టీకాలను ప్రెసికా మెడికోమెంటస్ ఫార్మసీ సంస్థ సరఫరా చేయనుంది. అయితే ఈ ఒప్పందంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో కోవాగ్జిన్‌పై ప్రత్యేక ఆసక్తి కనబరిచారని..ఆయన సన్నిహితులకు లబ్ది చేకూరేలా లావాదేవీలు జరిగాయని ఆ దేశపు సెనెటర్లు ఆరోపించడంతో వివాదాస్పదంగా మారింది. 734 కోట్ల మేర ముడుపులు మధ్యవర్థి కంపెనీతో పాటు బ్రెజిల్ ప్రెసిడెంట్ కి ముట్టాయనేది సెనేటర్ల ఆరోపణ. థర్డ్ పార్టీ కంపెనీ అయిన మాడిసన్ బయోటెక్ పేరిట బోల్సోనారో ఇన్ వాయిస్ లు సృష్టించారని ఫెడరల్ దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఈ నేపధ్యంలో గత ఫిబ్రవరిలో కుదుర్చుకున్న డీల్ ను రద్దు చేసుకున్నట్టు బ్రెజిల్ ఆరోగ్య శాఖ మంత్రి మార్సెలో క్విరోగా తాజాగా ప్రకటించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభమైందని మార్సెలో మీడియాకు వెల్లడించారు.