Covaxin vs Covishield vs 7 Others: కోవాగ్జిన్ vs కోవిషీల్డ్ vs ఏడు వ్యాక్సిన్‌లు.. ఏ వ్యాక్సిన్ సమర్థత ఎంత?
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు కాస్త తగ్గముఖం పట్టాయి. అందుకు కారణం కూడా వ్యాక్సినేషన్ అనే అభిప్రాయం నిపుణుల నుంచి వ్యక్తం అవుతోంది. భారత్‌లోనూ.. విదేశాలలోనూ.. వివిధ కంపెనీలు తయారుచేసిన కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల మరణాల రేటును గణనీయంగా తగ్గింది.

Vaccine
Which Vaccine Is better?: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు కాస్త తగ్గముఖం పట్టాయి. అందుకు కారణం కూడా వ్యాక్సినేషన్ అనే అభిప్రాయం నిపుణుల నుంచి వ్యక్తం అవుతోంది. భారత్‌లోనూ.. విదేశాలలోనూ.. వివిధ కంపెనీలు తయారుచేసిన కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల మరణాల రేటును గణనీయంగా తగ్గింది. ఈరోజు(03 జులై 2021) వరకు, ప్రపంచవ్యాప్తంగా 183.01 మిలియన్లకు పైగా ప్రజలు కరోనావైరస్ బారిన పడ్డారు. అందులో 3.96 మిలియన్లకు పైగా మరణాలు సంభవించాయి. వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాకుండా ఉండి ఉంటే మాత్రం మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండేది అని అంటున్నారు నిపుణులు.
కరోనా వ్యాక్సిన్ల విషయానికి వస్తే, మన దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ తయారవ్వగా.. ప్రపంచవ్యాప్తంగా మరో ఏడు వ్యాక్సిన్‌లు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. వ్యాక్సిన్ సమర్థత రేటును నిర్ణయించడానికి ఓ సర్వే నిర్వహించారు మెడిసిన్ తయారీదారులు. ఎంపిక చేసిన, పాల్గొనేవారిని రెండు గ్రూపులుగా విభజించి, సగం మందికి అసలైన వ్యాక్సిన్‌ను, మిగిలిన సగం మందికి ప్రభావం లేని మందును ఇచ్చారు. ఒక నిర్దిష్ట కాలం తరువాత, ఈ రెండు గ్రూపులలో కోవిడ్-19 ఎంత మందికి సోకిందో గుర్తించి లెక్కించారు. వారి నుంచి వచ్చిన డేటా ప్రకారం ఏ వ్యాక్సిన్ ఎలా ఎంత ప్రభావంతో పనిచేస్తుందో గుర్తించి డేటాను క్రియేట్ చేశారు.
ఫైజర్-బయోఎంటెక్(Pfizer-BioNTech):
ప్రపంచంలోనే ఫస్ట్ వ్యాక్సిన్ ఫైజర్-బయోఎంటెక్.. ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ డేటాను కంపెనీ నివేదించింది. డిసెంబర్ 11వ తేదీన, ఫైజర్ వ్యాక్సిన్‌ను అందుకోగా.. మే ప్రారంభంలో, ఫైజర్-బయోఎంటెక్ వ్యాక్సిన్ ఆల్ఫా వేరియంట్ (మొదటిసారి యునైటెడ్ కింగ్‌డమ్‌లో కనుగొనబడింది) మరియు బీటా వేరియంట్ (దక్షిణాఫ్రికాలో మొదట గుర్తించబడింది) నుంచి కాపాడడంలో మరణానికి వ్యతిరేకంగా 95శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఫైజర్ పనిచేసింది.

Pfizer Biontech
వ్యాక్సీన్ తొలి డోసు తర్వాత 52% సమర్థవంతంగా పని చేసిందని, మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా 36,523మందిపై ప్రయోగాలు జరిగినట్లు కంపెనీ ప్రకటించింది. కొందరికి 21 రోజుల వ్యవధిలో రెండుసార్లు వ్యాక్సీన్ ఇవ్వగా, వైరస్ లక్షణాలు లేని వారికి ప్లాసిబో(ఉత్తుత్తి వ్యాక్సీన్) ఇచ్చారు. ప్లాసిబో వ్యాక్సీన్ తీసుకున్న వారిలో 82మందికి వైరస్ సోకగా, నిజమైన వ్యాక్సీన్ తీసుకున్నవారిలో 39మందికి మాత్రమే కోవిడ్ సోకినట్లు తేలింది. ఫైజర్ వ్యాక్సిన్ రెండు మోతాదులు తీసుకున్న తర్వాత 95శాతం రక్షణ లభిస్తుంది. కొందరు డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్‌ల ప్రకారం.. కొందరిలో వ్యాక్సిన్ మొదటి మోతాదే 90శాతం ప్రభావవంతంగా పనిచేసింది.
మోడెర్నా(Moderna):
ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన ఒక వారం తర్వాత అమెరికాలో అత్యవసర ఉపయోగంలోకి వచ్చిన వ్యాక్సిన్ మోడెర్నా. ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీకి మోడెర్నా కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ కంపెనీ వ్యాక్సీన్ మొదటి డోస్ తర్వాత 80.2%, రెండో డోసు తర్వాత 95.6% రక్షణ కల్పిస్తుంది.( ఈ ఫలితం 18-65 సంవత్సరాల మధ్య వయస్కులకు సంబంధించినది. అదే 65 సంవత్సరాలు పైబడిన వారైతే దాని ప్రభావం 86.4% మాత్రమే).
ఫైజర్ వ్యాక్సీన్‌లాగే మూడో దశ ట్రయల్స్‌లో రెండు విడతలుగా రియల్ వ్యాక్సీన్, ప్లాసిబో వ్యాక్సీన్‌లను ఒకే టైమ్‌లో అంటే 28 రోజుల వ్యవధిలో ఇచ్చారు. సింగిల్ వ్యాక్సీన్ ద్వారా వచ్చిన రోగ నిరోధక శక్తి కొనసాగుతుందా? అన్నది చెప్పడం మాత్రం కష్టంగా మారిందని కంపెనీ చెప్పింది. మోడెర్నా వ్యాక్సిన్ ఆల్ఫా మరియు బీటా వేరియంట్లపై కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. రక్షణ కల్పిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

Moderna
జాన్సన్ & జాన్సన్(Johnson & Johnson):
ఫిబ్రవరి 27, 2021 న ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ అత్యవసర వినియోగ అనుమతి లభించిన కంపెనీ జాన్సన్ & జాన్సన్. ఫైజర్ మరియు మోడెర్నా వ్యాక్సిన్లతో పోల్చితే, ఇది నిల్వ చేయడం చాలా సులభం(రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతలో దీనిని స్టోర్ చెయ్యవచ్చు) ఇది ఒక్క షాట్ వేసుకుంటే చాలు.. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతకు కారణమైన డెల్టా వేరియంట్‌ను అరికట్టేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సింగిల్ డోసు డెల్టా వేరియంట్‌ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తుంది. ఈ వ్యాక్సిన్ ప్రభావం దాదాపు 8 నెలలపాటు ఉంటుంద చెబుతున్నారు నిపుణులు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న 85శాతం మందిలో వైరస్ ప్రాణాంతకం కాకుండా నియంత్రించినట్టు పరిశోధనలు చెబుతున్నాయి.

Johnson & Johnson
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా(AstraZeneca):
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ కంపెనీ ప్రచురించిన పేపర్ ప్రకారం, తొలి డోసు వేసుకున్న తర్వాత 64.1శాతం ప్రభావవంతంగా ఉందని, రెండు డోసులతో కలిపి ఈ వ్యాక్సీన్ ప్రభావం 70.4శాతం నుంచి 90శాతం వరకు ఉందని ప్రకటించింది. తొలి వ్యాక్సీన్ తీసుకున్న 3వ వారం నుంచి 9-12 వారాల మధ్య దాని ప్రభావం 70శాతం వరకు ఉంటుందని కంపెనీ చెబుతుంది. ఈ వ్యాక్సిన్ వేసుకున్న 15 రోజుల ఎక్కువ రోగలక్షణ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో 76% ప్రభావవంతంగా ఉందని మరియు తీవ్రమైన వ్యాధికి వ్యతిరేకంగా 100% ఉందని చూపించింది. 65 ఏళ్లు పైబడిన వారిలో COVID-19 ను నివారించడంలో ఈ టీకా 85% ప్రభావవంతంగా ఉందని కంపెనీ తెలిపింది.

Astra
నోవావాక్స్(Novavax):
ఈ వ్యాక్సిన్ COVID-19కి వ్యతిరేకంగా మాత్రమే కాకుండా, గ్రేట్ బ్రిటన్లో కనిపించిన మ్యూటేషన్స్‌కి వ్యతిరేకంగా మరియు దక్షిణాఫ్రికాలో ప్రభావవంతంగా ఉన్న మ్యూటేషన్స్‌కి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అమెరికా ఫార్మా కంపెనీ నోవావాక్స్ తమ కరోనా వ్యాక్సిన్ 93శాతం ప్రభావంతో పనిచేస్తుందని వెల్లడించింది కంపెనీ. ప్రపంచంలో కనిపిస్తోన్న అన్నీ వేరియెంట్లనూ వ్యాక్సిన్ ఎదుర్కోగలదని చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ వాడకానికి సురక్షితమైందని, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువని కంపెనీ చెబుతుంది.

Novavax
కోవిషీల్డ్(Covishield):
భారత్‌లో, తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎక్కువమంది వేసుకుని ఉన్న, అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ కోవిషీల్డ్. రెండు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లలో కూడా కోవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ ఎక్కువగా పంపిణీ చేస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం బ్రిటిష్-స్వీడిష్ సంస్థ ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(SII) భారతదేశంలో తయారుచేస్తోంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సమర్థతపై అధ్యయనాలు విస్తృతంగా ఉన్నాయి. ఆస్ట్రాజెనెకా ప్రకారం, మూడో దశ క్లీనికల్ ట్రయల్స్ ప్రాధమిక విశ్లేషణ తర్వాత, వ్యాక్సిన్ కోవిడ్-19కు వ్యతిరేకంగా 76శాతం సామర్థ్యంతో పనిచేస్తుంది. 12వారాల లేదా అంతకంటే ఎక్కువ ఇంటర్-డోస్ విరామంతో, టీకా సామర్థ్యం 82 శాతానికి పెరిగింది.

Covishield
స్పుత్నిక్-వి(Sputnik V):
రష్యాలోని మాస్కోలోని గమలేయ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డిఐఎఫ్) భాగస్వామ్యంతో తయారుచేసిన వ్యాక్సిన్ స్పుత్నిక్-వి. దీనిని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ భారతదేశంలో పంపిణీ చేస్తోంది. ది లాన్సెట్‌లో ప్రచురించిన ఫలితాల ప్రకారం, 3వ దశ ట్రయల్స్ తర్వాత స్పుత్నిక్-V సామర్థ్యం 91.6 శాతంగా ఉన్నట్లు కంపెనీలు చెబుతున్నాయి.

Sputnik V
కోవాక్జిన్(Covaxin):
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్.. కోవాక్జిన్ వ్యాక్సిన్‌ను తయారు చెయ్యగా.. COVID-19కు వ్యతిరేకంగా ఈ వ్యాక్సిన్ 77.8శాతం పనిచేస్తుంది. కొత్త డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా 65.2శాతం కాపాడుతోంది. కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని భారత్ బయోటెక్ వెల్లడించింది. కరోనా వైరస్‌పై 77.8 శాతం సమర్థతతో ఈ వ్యాక్సిన్ పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిలో 93.4 శాతం, డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం ప్రభావం చూపుతున్నట్టు భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. కరోనా తీవ్ర లక్షణాలను కొవాగ్జిన్ అడ్డుకుంటుందని, ఫలితంగా ఆసుపత్రిలో చేరే అవసరాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు.

Bharat Biotech Says Covaxin Phase 3 Data
సినోఫార్మ్(Sinopharm):
డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతగా పనిచేస్తున్నట్లు చెబుతున్న వ్యాక్సిన్ సినోఫార్మ్. ఇండోనేషియా మరియు బ్రెజిల్ వరకు అనేక దేశాలు తమ ప్రజలను COVID-19కు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌లు వేయడానికి చైనాపైనే ఆధారపడతాయి. డెల్టా వల్ల వచ్చే లక్షణాలను మరియు తీవ్రమైన కేసుల ప్రమాదాన్ని తగ్గించడంలో చైనీస్ వ్యాక్సిన్‌లు పనిచేస్తున్నాయి. చైనా నుంచి కనీసం ఐదు రకాల వ్యాక్సీన్‌లు తయారీ దశల్లో ఉండగా.. సినోఫార్మ్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాక్సిన్ రెండు డోసుల తర్వాత 79% ప్రభావవంతంగా పని చేసినట్లు చెబుతున్నారు. 10లక్షలమందికి పైగా ఈ వ్యాక్సీన్‌ను అందజేశారు. చైనాకు ఆవల బహ్రైన్, ఈజిప్ట్, జోర్డాన్, సెషెల్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లాంటి దేశాలు ఈ వ్యాక్సిన్‌ను వాడుతున్నాయి. ఈ వ్యాక్సిన్ 86% సమర్ధవంతంగా పని చేస్తోందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది.