Migrant Worker From Odisha Takes Gold Loan Of Rs 30,000 To Buy Food
Migrant worker from Odisha : భారత్‌ను కరోనావైరస్ సెకండ్ వేవ్ వణికిస్తోంది. లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.. వేలల్లో మరణాలు పెరుగుతున్నాయి. కరోనా కట్టడి చేసేందుకు దేశంలోని పలు రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. దేశ రాజధానిలో ఢిల్లీ ప్రభుత్వం కూడా ఏప్రిల్ 17న లాక్ డౌన్ విధించింది. దాంతో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పటినుంచి వలస కార్మికుడు సుశీల్ రౌత్ అనే వ్యక్తికి పని లేదు. తన కుటుంబంతో కలిసి దక్షిణ ఢిల్లీ మురికివాడలోని ఓ అద్దె గదిలో నివసిస్తున్నాడు. ఒడిశాలోని కేంద్రాపాడకు చెందిన ఈ ప్లంబర్ సుశీల్‌కు ఎక్కడా సాయం అందలేదు.
ఇద్దరు చిన్న పిల్లలతో మొత్తం నలుగురు ఉన్న తన కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. మరో దారి లేక రౌత్ తన భార్య బంగారు నగలను తాకట్టు పెట్టాడు. ముథూట్ ఫైనాన్స్ నుంచి రూ .30,000 రుణం తీసుకున్నాడు. ఒడిశాకు తిరిగి వెళ్దామనుకుంటే కరోనా పరిస్థితి ఆందోళనగా ఉంది. ఒడిశా ప్రభుత్వం కూడా లాక్ డౌన్ విధించింది. అక్కడికి వెళ్లినా పనిదొరకుతుందని గ్యారెంటీ లేదు. అందుకే ఉన్నచోటనే ఉండిపోయాడు. నెలసరి ఆదాయం లేనందున రుణం తీసుకోవాల్సి వచ్చిందని రౌత్ వాపోతున్నాడు.
ఢిల్లీ ప్రభుత్వం వలస కార్మికుల కోసం ప్రత్యేకించి ఉచిత భోజనం సెంటర్లను ఏర్పాటు చేసింది. కానీ, రౌత్ ఇంటి నుంచి కనీసం 2 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ వెళ్లినా అక్కడ భారీ క్యూతో చాలా పొడవుగా ఉంటుందని అంటున్నాడు. కొన్నిరాష్ట్రాల్లో వలసదారులకు సబ్సిడీ రేషన్లు అందిస్తున్నాయి. కానీ, ఢిల్లీ ఈ పథకం అమల్లో లేదు. దేశంలో పలు ప్రాంతాల నుంచి వలస వచ్చిన ఐదుగురిలో నలుగురికి గత రెండు వారాలుగా పని దొరకడం లేదు.. దాంతో కుటుంబ పోషణకు, తినేందుకు ఆహారం లేక ఆకలితో అల్లాడిపోతున్నారు.